గోలివాడవైపు గోదారమ్మ ★ మేడిగడ్డ నుంచి 96 కి.మీ. ఎదురు ప్రయాణం

★ గోలివాడవైపు గోదారమ్మ


★ మేడిగడ్డ నుంచి 96 కి.మీ. ఎదురు ప్రయాణం


★ నిండుకుండను తలపిస్తున్న సుందిల్ల బరాజ్


★ గోలివాడ పంప్‌హౌస్‌కు దగ్గరలో జలాలు


★ సోమవారం ఎల్లంపల్లిలోకి ఎత్తిపోత


★ అన్నారం పంపుహౌస్‌లో 4వ మోటర్ ప్రారంభం


★ మొత్తం నాలుగు మోటర్ల వెట్న్


★ కన్నెపల్లిలో ఆరు మోటర్లతో ఎత్తిపోతలు


★ నేడు ప్రారంభంకానున్న 7వ మోటర్


★ బరాజ్‌లలో నీటి నిల్వలు


★ మేడిగడ్డ : 5.70 టీఎంసీలు


★ అన్నారం : 7.68 టీఎంసీలు


★ సుందిల్ల : 1.75 టీఎంసీలు


గోదావరి జలాలు వ్యతిరేకదిశలో పరవళ్లు తొక్కుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను దాటుకొని మంథని మండలం సిరిపురంలోని సుందిల్ల బరాజ్‌లోకి చేరుతున్నాయి. కన్నెపల్లినుంచి ఆరు మోటర్లతో ఎత్తిపోసిన జలాలతో అన్నారం బరాజ్.. అన్నారం పంప్‌హౌస్‌లోని నాలుగు మోటర్లతో నిరంతరాయంగా ఎత్తిపోసిన నీటితో సుందిల్ల బరాజ్.. నిండుకుండలను తలపిస్తున్నాయి. సుందిల్ల బరాజ్‌లోకి ప్రస్తుతం 1.755 టీఎంసీల నీరు చేరింది. ఇది గురువారం అర్ధరాత్రికల్లా రెండు టీఎంసీలకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. సుందిల్ల బరాజ్‌లోకి భారీగా నీరు చేరుతుండడంతో గోదావరి ఎదురెక్కుతూ అంతర్గాం మండలం గోలివాడలోని సుందిల్ల పంప్‌హౌస్‌వైపు పరుగులు తీస్తున్నది. మొత్తంగా మేడిగడ్డ నుంచి 96 కిలోమీటర్ల దూరం గోదావరి జలాలు నదిలో ఎదురు ప్రయాణం చేశాయి. ప్రస్తుతం గోలివాడ పంపుహౌస్‌కు మరో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గోలివాడకు నీరు చేరుకుంటే.. తదుపరి మజిలీ అయిన ఎల్లంపల్లి బరాజ్‌ను నింపుతారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.


కన్నెపల్లిలో నిరంతర ఎత్తిపోతలు
-------------------------------------------
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు ఆరు మోటర్ల ద్వారా రోజుకు 1.2 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం ఉదయం ఆరుగంటలకు ఐదో నంబర్ మోటర్‌ను సాంతికేక కారణాలతో నిలిపివేసిన అధికారులు.. సాయంత్రం 5.45 గంటలకు మళ్లీ దానిని ప్రారంభించారు. ఒకటవ నంబర్ మోటర్‌ను కూడా సాయంత్రం ఆరుగంటలకు ఆపి.. అరగంట తర్వాత మళ్లీ పనిచేయించారు. మరోవైపు పంప్‌హౌస్‌లోని 7వ మోటర్‌ను శుక్రవారం ప్రారంభించేందుకు ఇంజినీర్లు ఏర్పాట్లుచేస్తున్నారు. మొత్తంగా గురువారం వరకు కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని 1, 2, 3, 4, 5, 6వ నంబర్ మోటర్లద్వారా అన్నారం బరాజ్‌కు 9.3 టీఎంసీల నీరు చేరుకున్నది. గురువారం సాయంత్రానికి అన్నారం బరాజ్‌లో 7.6 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నీటిమట్టం బరాజ్ గేట్ల వద్ద 11.55 మీటర్లకు చేరుకున్నది.


అన్నారం పంప్‌హౌస్‌లోని మూడు మోటర్ల ద్వారా సుందిల్ల బరాజ్‌కు 1.678 టీఎంసీల నీటిని తరలించామని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. నాలుగో మోటర్ కూడా ప్రారంభమైనందున ఇక రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. ప్రాణహిత నుంచి గోదావరికి 9వేల క్యూసెక్కుల నీరు వస్తున్నదని తెలిపారు. మేడిగడ్డ బరాజ్‌లో ప్రస్తుతం 5.70 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. బ్యాక్‌వాటర్ 27 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అటు అన్నారం బరాజ్ బ్యాక్‌వాటర్ పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట వద్దకు 28 కిలోమీటర్ల వరకు చేరుకున్నట్లు ఈఎన్సీ తెలిపారు. అన్నారం పంప్‌హౌస్‌లోని మూడు మోటర్లు నిరంతరాయంగా నడుస్తుండగా, గురువారం రాత్రి 4వ మోటర్‌ను విజయవంతంగా ప్రారంభించారు. దీంతో డెలివరీ సిస్టర్న్‌లోని ఎనిమిది పైపుల ద్వారా కాళేశ్వరం జలాలు సుందిల్ల బరాజ్‌కు పరుగులు తీస్తున్నాయి. పుష్కలంగా నీరు చేరుతుండటంతో బ్యాక్‌వాటర్ క్రమంగా ఎదురెక్కుతున్నది.


పెరుగుతున్న సందర్శకుల తాకిడి
----------------------------------------------
సుందిల్ల బరాజ్, అన్నారం పంప్‌హౌస్‌లను చూసేందుకు వివిధజిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, ప్రజలు తరలివస్తున్నారు. గురువారం వనపర్తి, జగిత్యాల జిల్లాలనుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన రైతులు సుందిల్ల బరాజ్‌లో పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి పరవశించిపోయారు.


తుంగభద్ర ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ఫ్లో
-------------------------------------------------
అయిజ/ మక్తల్ రూరల్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు అంతకంతకూ పెరుగుతున్నది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో గురువారం టీబీ డ్యాంలోకి 19,644 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దిగువకు 1,750 క్యూసెక్కుల నీటిని విడుదలచేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 19.868 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఇదిలాఉంటే.. ఆల్మట్టికి మూడు రోజుల నుంచి 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టులో 120.70 టీఎంసీల నీటినిల్వ ఉంది. దిగువకు నీటి విడుదల నిలిపివేసి.. వచ్చిన నీటిని వచ్చినట్టే నిల్వచేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలోని శక్తినగర్ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా వడ్లూరు వాగు ఉప్పొంగి నీరు కృష్ణానదిలోకి చేరింది. తెలంగాణలోని కృష్ణ మండలం పస్పుల వద్ద వాగునీటితో నది కళకళలాడింది. నీళ్లులేక ఇన్నాళ్లూ వట్టిపోయిన కృష్ణమ్మ జలకళలాడటంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వరిసాగుకోసం అన్నదాతల ఆశలు సజీవంగా నిలిచాయి.


సోమవారం నుంచి గోలివాడలో ఎత్తిపోతలు
--------------------------------------------------------
గోలివాడలోని సుందిల్ల పంప్‌హౌస్‌లో 1వ నంబర్ మోటర్‌ను సోమవారం ప్రారంభించనున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారంనాటికి ఆరు మోటర్లను సిద్ధంచేసి, మరుసటిరోజు ఒకటవ నంబర్ మోటర్‌ను తొలుత ప్రారంభిస్తామని చెప్పారు. ఆ సమయానికి సుందిల్ల బరాజ్‌లో దాదాపుగా ఐదు టీఎంసీల వరకు నీరు చేరే అవకాశం ఉన్నదని తెలిపారు. గోలివాడ పంప్‌హౌస్‌లో మొత్తం తొమ్మిది మోటర్లకు అన్నిరకాల పరీక్షలను క్రమక్రమంగా పూర్తిచేస్తున్నామని వివరించారు. శని, ఆదివారాల్లో 1వ నంబర్ మోటర్‌ను వెట్న్‌క్రు సిద్ధంచేసి, సోమవారం నీటి ఎత్తిపోత మొదలుపెడుతామని వివరించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్