*రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవు : సిఐ సురేష్*
*రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవు : సిఐ సురేష్*
నల్గొండ : రోడ్లపై వాహనాలను అడ్డగోలుగా పార్కింగ్ చేసినా, షాపుల ముందు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేసినా చర్యలు తప్పవని నల్గొండ ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్ హెచ్చరించారు.
సోమవారం నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ రిలయన్స్ షాపింగ్ మాల్ నుండి అన్ని షాపుల వద్ద ఆర్.పి.రోడ్, హైద్రాబాద్ రోడ్ లోని హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్, భరద్వాజ్ ఆసుపత్రి ప్రాంతంలో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాల పై ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత షాపింగ్ మాల్స్, దుకాణాల యజమానులతో ప్రత్యేకంగా మాట్లాడి తమ దుకాణాలకు వచ్చే వినియోగదారులు రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ చేస్తున్న విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు పై వెళ్లే ఇతర వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ చేసుకునే విధంగా చూసుకోవాలని చెప్పారు. రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద అధికంగా వాహనాలు రోడ్లపై నిలుపుతుండడంతో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించే విధంగా ప్రతి రోజు దృష్టి పెడతామని చెప్పారు. సెల్లార్ పార్కింగ్ కచ్చితంగా వినియోగించే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత షాపింగ్ మాల్ నిర్వాహకుల పైనే ఉన్నదని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది వాహనాల పార్కింగ్ పై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇతరులకు సమస్య కాకుండా చూడాలన్నారు. ఇకపై రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాల పార్కింగ్ చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్గొండ పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అధికం అవుతున్న క్రమంలో అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అదే సమయంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పై ప్రజలు తమకు సమాచారంతో పాటు సూచనలు అందించి ట్రాఫిక్ సమస్య లేని పట్టణంగా నల్గొండను తయారు చేయడానికి సహకారం అందించాలని సిఐ సురేష్ కుమార్ కోరారు.
Comments
Post a Comment