బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు....
- బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు
స్వాధీనం చేసుకున్న శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.11 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో దిగిన సాజిద్ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి తాను తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలోని మరుగుదొడ్డిలో పడేశాడు. కాగా సాజిద్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు అతని వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా శౌచాలయంలో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Comments
Post a Comment