*ఆన్ లైన్ బెట్టింగ్, బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల నజర్*
*ఆన్ లైన్ బెట్టింగ్, బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల నజర్*
- - బెట్టింగులకు, అధిక వడ్డీకి వ్యాపారానికి పాల్పడే వారి సమాచారం ఇవ్వండి
- - బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్ నిర్వహణ పై పోలీస్ నిఘా
- - సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం
- - అధిక వడ్డీలు, బెట్టింగుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సామాన్యులు
- - బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
నల్గొండ : జిల్లాలో బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లకు పాల్పడే వారితో పాటు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారుల వివరాలు నేరుగా తనకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
ఎంతో మంది సామాన్య, పేద ప్రజలు డబ్బు ఆశతో జూదానికి, ఆన్ లైన్ బెట్టింగులకు, బెట్టింగులకు పాల్పడుతూ, తమ వద్ద డబ్బులు లేక అప్పులు తీసుకొని సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇటీవలి కాలంలో బెట్టింగులు, జూదం నడుస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చిందని ఈ క్రమంలో జిల్లాలో జూదం, బెట్టింగులు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అయినప్పటికీ సామాన్య ప్రజల అవసరాలు, వారి నిస్సహాయతలను వారికి అనుకూలంగా మార్చుకుంటూ వడ్డీ వ్యాపారులు సైతం అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వారిని పీడిస్తున్న సంఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి గ్యాంబ్లింగ్, జూదం, బెట్టింగ్స్ తో పాటుగా అధిక వడ్డీలకు వ్యాపారం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ 5 నుండి పది రూపాయల వరకు వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారుల సమాచారాన్ని నేరుగా తనకు 9440795600 నెంబర్ కు వాట్స్ అప్, మెసేజ్ రూపంలో, సంబంధిత పోలీస్ అధికారులకు కానీ పంపించాలని ఆయన కోరారు. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీలు నడిపే వారిపట్ల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అసాంఘిక కార్యకలాపాలు, బెట్టింగ్స్, జూదం, అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ వ్యాపారం నిర్వహించే వారి పట్ల నిఘా పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోనూ జూదం ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో తోటలు, వ్యవసాయ క్షేత్రాలను అద్దాలుగా చేసుకొని జూదం, బెట్టింగులకు పాల్పడుతున్న వారి పట్ల నిఘాను పెంచినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ పై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని ఆయన తెలిపారు. జిల్లాలో బెట్టింగ్స్, జూదం, గ్యాంబ్లింగులకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు పోలీసులతో సహకరించాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు.
వీటన్నింటితో పాటుగా అధిక వడ్డీలకు వ్యాపారం నిర్వహించే వారి వల్ల ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులకు గురై మానసికంగా వత్తిడులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఇలాంటి సంఘటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రంగనాధ్ హెచ్చరించారు.
Comments
Post a Comment