కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి!
కొండా సురేఖ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి!
వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్‌లు సైతం కాషాయ కండువా కప్పేసుకున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమలనాథులు కండువా కప్పేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మహిళా నేత కొండా సురేఖ, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఇదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో.. నగరంలోని పలు కార్యక్రమాను రద్దు చేసుకున్న షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు. అయితే ఢిల్లీ వెళ్లి మరి అమిత్‌షాను కలిసే యోచనలో రేవూరి ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. తమ్ముడి మృతితో కొండా సురేఖ బీజేపీలో చేరికకు కొంత ఆలస్యమైంది. అయితే రేవూరి.. తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. రేవూరి చేరిక ఖరారైతే మాత్రం టీడీపీకి ఊహించని షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొండా సురేఖ, రేవూరి ఇద్దరూ ఒకేసారి కాషాయం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
Comments
Post a Comment