*సోదరుడిపై గొడ్డలితో దాడి కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా*
*సోదరుడిపై గొడ్డలితో దాడి కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా*
నల్గొండ : జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతంలో పక్కపక్కనే ఇండ్లు కట్టుకుంటున్న సోదరులు ఘర్షణ పడి గొడ్డలితో దాడి చేసుకున్న కేసులో నిందితునికి అయిదు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎం. వెంకటేశ్వర్ రావు తీర్పునిచ్చారు.
కేసు వివరాలలోకి వెళితే నల్గొండ పట్టణం బొట్టుగూడ ప్రాంతంలో తాతల ద్వారా సంక్రమించిన భూమిలో పక్కపక్కనే ఇండ్లు కట్టుకుంటున్న సోదరులు మహ్మద్ షాకీర్, ఎం.డి. సాబేర్ లకు బాత్రూమ్ నిర్మాణ విషయంలో ఘర్షణ పడ్డారు. తనతో ఘర్షణ పడ్డాడని మనసులో పెట్టుకొని మహ్మద్ షాకీర్ ఘర్షణ జరిగిన వారం రోజుల తర్వాత తేది. 30.10.2015 రోజున ఉద్దేశ్య పూర్వకంగా గొడ్డలితో తన ఇంటి పక్కనే బాత్రూమ్ నిర్మిస్తున్న సోదరుడు ఎం.డి.సాబేర్ పై ప్రకాశం బజార్ వెనుక భాగంలో వస్త్రలత బజార్ లో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయబోయాడు. షాకీర్ గొడ్డలితో వెంటపడి సాబేర్ పై దాడి చేయగా తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
సాబేర్ బంధువు అయిన ఎం.డి. మున్వర్ పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అప్పటి ఎస్.ఐ. యాదవేందర్ రెడ్డి, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించి కేసు విచారణ చేశారు. పోలీసుల విచారణ నివేదిక, సాక్షుల వివరాల ప్రకారం గురువారం రోజు నిందితునికి అయిదు సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు.
కేసులో ప్రభుత్వం తరపున అదనపు పిపి శ్రీవాణి వాదించగా ప్రస్తుత వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్, వి. రాంబాబు, లైజన్ అధికారులు చంద్రశేఖర్, వి. శ్రీనివాస్, అసిస్టెంట్ లైజన్ అధికారి పి. నరేందర్ లు సహకరించారు.
Comments
Post a Comment