సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించిన కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో రైల్వే జీఎం గజానన్, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైల్వే సమస్యలు, రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై చర్చించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయని, వీటన్నింటినీ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించి త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత చర్లపల్లిలో టెర్మినల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులు వేగవంతం చేసామని, ఈ టెర్మినల్ పూర్తయితే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు రద్దీ తగ్గుతుందని అన్నారు. దీనిని అత్యంత విశాలంగా నిర్మించాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సరిపోయినంతగా భూమి ఇవ్వనందుకు 50 ఎకరాల్లోనే ఈ టెర్మినల్ నిర్మిస్తున్నామని, రూ.81కోట్లతో పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఘట్ కేసర్- రాయగిరి రైల్వే లైన్, MMTS ఫేజ్ 2కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వనందుకే పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
గతంలో కంటే తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని, 94 శాతం అదనంగా నిధుల కేటాయింపులు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందని, కనీసం రైల్లలో ప్రయాణం చేసే అలవాటు కూడా ప్రజలకు లేకుండా చేసారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైల్వే విషయంలో రూ.1813 కోట్లు తెలంగాణకు అదనంగా నిధులు కేటాయించి, రానున్న రోజుల్లో రైల్వే పనులను వేగంవంతం చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు తెలంగాణ మెజారిటీ ప్రాంతం రైల్ కనెక్ట్ లోకి తీసుకువస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
Comments
Post a Comment