ఎంతపని చేశావ్...శృతి..!
ఎంతపని చేశావ్...శృతి..!
ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
ఖిలా వరంగల్: ఉన్నత విద్యనార్జించిన కన్నకూతురు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో రాణిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. తనకు కొలువురాలేదని మానసికంగా ఆందోళనతో చిర్ర శృతి అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 11వ, డివిజన్ క్రిష్టియన్ కాలనీలో జరిగింది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్ర రవీందర్-రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారన్నారు. కాగా, పెద్ద కుమార్తెకు వివాహం కాగా, కుమారుడికి సైతం వివాహం జరిగిందన్నారు. చిన్న కుమార్తె శృతి ఎంబీఏ విద్యనార్జించి ఇటీవల ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగం రాయడానికి ఎంపికైందన్నారు. అప్పటి నుంచి శృతి ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన పిదప, రిటర్న్ టెస్ట్‌లో సైతం 106 మార్కులు సాధించిందన్నారు.
ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాలలో శృతికి ఉద్యోగం రాకపొవడంతో మానసికంగా ఆందోళన చెంది గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకొందన్నారు. ఉదయం తల్లిదండ్రులు నిద్రనుంచి లేచి చూసేసరికి తాడుకు వేలాడుతుండడంతో వెంటనే ఎంజీఎంకు తరలించామన్నారు. అప్పటికే శృతి మృతి చెందినట్లు ఎంజీఎం డాక్టర్లు తెలిపారన్నారు. కాగా, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో మృతురాలు తండ్రి రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవీందర్ కేసు నమోదు చెసుకొని దర్యాప్తు జరిపారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతురాలు శృతిని తలుచుకుంటూ తల్లి రాణి రోదిస్తున్న తీరును చూసి స్థానిక మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.
Comments
Post a Comment