సుష్మా చివరి వాగ్దానాన్ని నెరవేర్చిన కూతురు
సుష్మా చివరి వాగ్దానాన్ని నెరవేర్చిన కూతురు
దిల్లీ: తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచిన దివంగత నేత సుష్మా స్వరాజ్ చివరి వాగ్దానాన్ని ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ నెరవేర్చారు. గూఢచర్యం ఆరోపణలతో పాక్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఆయన ఒక రూపాయి ఫీజు పుచ్చుకుంటానని గతంలో సుష్మాతో అన్నారు. అయితే గత నెల ఆరో తేదీన మరణించడానికి కొన్ని గంటల ముందు ఆమె సాల్వేకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఒక రూపాయి ఫీజు తీసుకునేందుకు ఇంటికి రావాలని కోరారని సాల్వే తెలిపారు. ఆ తర్వాత గంట సేపటికే ఆమె గుండెపోటుతో మరణించారు. తన తల్లి చివరి వాగ్దానాన్ని నెరవేర్చాలని బన్సూరి నిర్ణయించుకున్నారు. హరీశ్ సాల్వేను శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి రూపాయి ఫీజు అందజేశారు.
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపుదల చేస్తూ ఐసీజే ఇచ్చిన తీర్పులో హరీష్ సాల్వే వాదనలే కీలకం. విదేశీ జైల్లో ఉన్న కుల్‌భూషణ్‌ను అధికారులు కలుసుకోడానికి అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మ తీవ్ర ప్రయత్నాలు చేశారు. జాదవ్ కుటుంబంతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వారు కుల్‌భూషణ్‌ని కలవడానికి అధికారులు, న్యాయనిపుణులతో కలిసి పనిచేశారు. జాదవ్ ఉరి శిక్షను నిలిపివేయడంలో హరీష్ సాల్వే కృషిని ఆమె ప్రశంసించారు.
Comments
Post a Comment