ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్

ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్



ఆయన మాటల్లోనే


***జీవుడిలో దేవుడిని చూడటం మా సంస్కృతి.***
***సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌' నినాదంతో ముందుకెళ్తున్నాం***
**అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు కృషిచేశాం**
***125 ఏళ్ల క్రితం భారత ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ఇదే అమెరికాలోని షికాగో వేదికగా ప్రపంచానికి శాంతి, సామరస్య సందేశమిచ్చారు. ఈ రోజు కూడా అంతర్జాతీయ సమాజం కోసం భారత్‌ అదే సందేశాన్ని వినిపిస్తోంది.***
***అందరి కోసం త్రికరణ శుద్ధితో ఆలోచిస్తాం***
***ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారత్‌లో మేం పెద్దయెత్తున ప్రచారోద్యమం ప్రారంభించాం.***
 ***రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం.***
**బుద్ధుడి శాంతి సందేశాన్ని ఇచ్చిన దేశవాసులం***


వేల ఏళ్లనాటి గొప్ప సంస్కృతి, జీవన విధానాలను ఇరుసులుగా చేసుకొని భారత్‌ వేగంగా ప్రగతి పథంలో దూసుకెళ్లగలుగుతోంది. జీవుడిలో దేవుడిని చూడటం మా సంస్కృతి. జన భాగస్వామ్యంతోనే సంక్షేమం సాధ్యమన్నది మా విధానం. భారత్‌ ప్రపంచ కలలను తన కలలుగా చూస్తుంది. ప్రపంచ సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆ స్ఫూర్తితోనే 'సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌' నినాదంతో ముందుకెళ్తున్నాం. అందరి కలలను నెరవేర్చేందుకు కృషిచేస్తున్నాం. పరిశ్రమ మాదైనప్పటికీ ఫలితాలు అందరికోసం.
-


 



తలసరి కర్బన ఉద్గారాల్లో మా వాటా చాలా తక్కువ. కానీ దాని పరిష్కారం కోసం కృషి చేయడంలో మేం ముందున్నాం. మా దేశంలో 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు కృషిచేశాం. భూతాపం కారణంగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పెరుగుతోంది. కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే 'విపత్తు ప్రతిస్పందన సదుపాయాల సమాఖ్య' ఏర్పాటుకు ముందుకొచ్చాం.


         ప్రస్తుతం ప్రపంచ స్వరూపం మారుతోంది. ఆధునిక సాంకేతికత కారణంగా జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ, భద్రత, అనుసంధానత, అంతర్జాతీయ సంబంధాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండటం శ్రేయస్కరం కాదు. సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలి. ఐరాసకు నూతనోత్తేజాన్నివ్వాలి. 125 ఏళ్ల క్రితం భారత ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ఇదే అమెరికాలోని షికాగో వేదికగా ప్రపంచానికి శాంతి, సామరస్య సందేశమిచ్చారు. ఈ రోజు కూడా అంతర్జాతీయ సమాజం కోసం భారత్‌ అదే సందేశాన్ని వినిపిస్తోంది.



ప్రగతి పథంలో మాలాగే ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న దేశాల గురించి తెలుసుకుంటున్నప్పుడు నా సంకల్పం మరింత దృఢమవుతుంది. ఆ దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి వారికి మా అనుభవం దోహదపడుతుందనిపిస్తుంది. 'మనం అందరి కోసం త్రికరణ శుద్ధితో ఆలోచిస్తాం. అందరూ మనవాళ్లే అనుకుంటాం' అని మూడు వేల ఏళ్ల కిందటే భారతీయ మహాకవి కన్యన్‌ పుంగున్‌ద్రనర్‌ చెప్పారు. భారత గడ్డ విశిష్టత అది. ప్రపంచ స్థాయి సవాళ్లపై మేం పోరాడుతుంటాం.


ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా రాసి ఉన్న నినాదాన్ని నేను ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టేముందు ఐరాస భవనం గోడపై చూశాను. దాన్ని చూడకముందు నుంచే ఆ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారత్‌లో మేం పెద్దయెత్తున ప్రచారోద్యమం ప్రారంభించాం.


భారత్‌ అభివృద్ధి కాంక్షిత దేశం. అతిపెద్ద స్వచ్ఛతా అభియాన్‌ను మేం విజయవంతంగా అమలుచేశాం. 50 కోట్లమంది ప్రజలకు ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. అయిదేళ్లలో 37 కోట్లమందితో బ్యాంకు ఖాతాలు తెరిపించాం. బయోమెట్రిక్‌ గుర్తింపు విధానాలను తీసుకొచ్చాం. అవినీతికి అడ్డుకట్ట వేశాం. 20 బిలియన్‌ డాలర్లకుపైగా నిధులను ఆదా చేశాం. తద్వారా ప్రపంచానికి సరికొత్త విశ్వాసం కల్పించాం. 


ఐరాస శాంతి పరిరక్షణ మిషన్‌లో అందరికంటే ఎక్కువ బలిదానాలు చేసింది మా దేశమే. ప్రపంచానికి యుద్ధాన్ని కాకుండా బుద్ధుడి శాంతి సందేశాన్ని ఇచ్చిన దేశవాసులం మేము. అందుకే మా గొంతులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేసేటంత తీవ్రతతోపాటు ఆక్రోశం కూడా ఉంటుంది. మానవతావాదం కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకమవ్వడం అనివార్యం.


 


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్