సహోద్యోగి వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ...
సహోద్యోగి వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
గల్లంతయిన వారంతా ఈసీఐఎల్ అంకుర ఆస్పత్రి ఉద్యోగులే
ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు
సూర్యాపేట: కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్ వాసులు గల్లంతయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారిలో అబ్దుల్ అజిత్ (45), రాజేష్ 29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23),నగేష్ (35) పవన్ కుమార్ (23) ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతయినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అంకుర ఆస్పత్రి వద్ద విషాదఛాయలు
దుర్ఘటన విషయం తెలుసుకుని గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం వారంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
స్నేహితులు చూస్తుండగానే..
అదుపుతప్పిన స్కార్పియో వాహనం వెనకున్న ఇన్నోవా వాహనంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో నలుగురు సహోద్యోగులు ఉన్నారు. వీరంతా చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో స్కార్పియో వాహనం అదుపుతప్పి కాల్వలో పడిపోయినట్లు వారు ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ సమయంలో భారీ వర్షం పడుతుందని తెలిపారు.
Comments
Post a Comment