ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కారు* *-టీయూడబ్ల్యూజే ధర్నాలో పలువురి ధ్వజం*


*ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ సర్కారు*
*-టీయూడబ్ల్యూజే ధర్నాలో పలువురి ధ్వజం*


హైదరాబాద్, అక్టోబర్ 14: ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించడం సహించరానిదని పలువురు ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మూడవ దఫా పోరుబాటలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) పిలుపు మేరకు హెచ్.యూ.జే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ సర్కారు నియంతృత్వ పోకడలను అవలంభిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగాలను, చివరికి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన జర్నలిస్టులకు ఎన్నో హామీలతో కేసీఆర్ మభ్య పెట్టి మోసగించడం విచారకరమన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో చారిత్రాత్మక పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేని కష్టాలను ప్రజలు అనుభవించడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు నేడు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా జర్నలిస్టులనే మోసగించడం బట్టి చూస్తే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అంచానా వేసుకోవచ్చని విమర్శించారు. తమ హక్కుల సాధనకై ఉద్యమిస్తున్న సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ అణచివేయడం సహించరానిదన్నారు. నేడు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరినే నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు అవలంబించి ఉంటే రాష్ట్రాన్ని సాధించడం సాధ్యం కాకపోయేదన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐజేయూ సీనియర్ నాయకులు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదని, గత ఎన్నికల సమయం లో అధికార టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నామని ఆయన అన్నారు. సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. సమస్యల పరిష్కారం జరిగెంత వరకు తమ ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు దఫాలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జర్నలిస్టుల ఆందోళన విజయవంతమై చరిత్ర సృష్టించిందన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు, హెల్త్ కార్డులు, అందరికీ అక్రెడిటేషన్లు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలుపుకునేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు. హెచ్.యూజే కార్యదర్శి శిగ శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, సిసిఐ సభ్యులు ఎం.ఎ మాజీద్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, నాయకులు యాదగిరి, రాజేష్ ,రియాజ్ అహ్మద్, హబిబ్ జిలానీ, రాములు, వెంకటచారీ, డి. స్వామి, గౌస్, సుధాకర్, జునైద్, ఇబ్రహీం,చారి,గోపినాధ్,మల్లేష్,సాగర్,గిరిబాబు,వినయ్,శ్రీనివాస్,సత్యం, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు అనిల్ కుమార్, నక్క శ్రీనివాస్శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మానిక్ రాజ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.


*ఆత్మ బలిదానం చేసిన కార్మికులకు నివాళులు*
------------------------------------------------------------
తోటి కార్మికులకు మేలు జరగాలనే లక్ష్యంతో తమ ప్రాణాలను బలిదానం చేసిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పిస్తూ జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకై జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు ప్రకటించారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్