కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు
హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్ పథకం పన్నాడు.
ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. 'మా నాన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది' అని కీర్తి ముందు శశి బిల్డప్ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి శశికుమార్‌నే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శశికుమార్ ఇంట్లో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వాళ్లు 'నీ ఇష్టమున్నట్టు చేస్కో' అని వదిలేశారు. ఇక కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పాడు శశికుమార్. అందుకు రజిత నిరాకరించింది. అమ్మాయి చదువుకునేది చాలా ఉందని చెప్పింది. ఇది మనసులో పెట్టుకున్న శశికుమార్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో కీర్తికి గతంలో తాము అద్దెకు ఉన్న పక్క కాలనీలో ఉండే బాల్‌రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. బాల్‌రెడ్డి గురించి తెలిసిన కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నా రు. ఈ విషయం తెలిసి శశికుమార్.. కీర్తి వెంటపడ్డాడు. 'నువ్వు నాతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. అందరికీ చూపిస్తాన'ని బెదిరించాడు.
తనతోనే ఉండాలని వెంటపడినా మొదట్లో నిరాకరించింది. ఆ తర్వాత శశికుమార్ వేధింపులు తారస్థాయికి చేరాయి. కీర్తి పెళ్లి చేసుకునే బాల్‌రెడ్డికి కూడా చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్ ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టింది కీర్తి. ఇందులో భాగంగానే శశికుమార్ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శశికుమార్ చెప్పినట్టుగా నటించిన కీర్తి చివరకు తండ్రితోనే అబద్ధం చెప్పి పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇచ్చింది.
అయితే కూతురు ప్రవర్తన అనుమానంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కీర్తి ధైర్యం చేసి అమ్మ రజితకు చెప్పినా, నాన్న శ్రీనివాస్‌రెడ్డికి చెప్పినా, చివరకు షీటీమ్స్‌ను ఆశ్రయించినా పరిస్థితి హత్య వరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం ఏసీబీ చేతికి చిక్కిన మహబూబ్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడు శశికుమార్ అని తెలిసింది. కీర్తికి అబార్షన్ చేయించేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడి తండ్రి ఏమైనా సహకరించాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించని పోలీసులు బుధవారం నిందితుల అరెస్టు చూపే అవకాశం ఉంది.
Comments
Post a Comment