**ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్**
*ప్రమాదాల నివారణలో ప్రజలు తమతో బాగస్వామ్యులు కావాలి : ఎస్పీ రంగనాధ్*
- - చెర్వుగట్టు వద్ద మూసివేసిన వ్యాపారస్థుల విజ్ఞప్తి మేరకు తిరిగి తెరుస్తామని హామీ
- - వ్యాపారస్థుల ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి
నల్గొండ : కార్తీకమాసం దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలు, వ్యాపారస్థులు భాగస్వామ్యం వహించాలని అప్పుడే సత్ఫలితాలు సాధ్యమని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.
బుధవారం నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో మూసివేసిన రోడ్డును తిరిగి తెరవాలని వ్యాపారస్తులు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ద్వారా జిల్లా ఎస్పీ రంగనాధ్ దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం చెర్వుగట్టును సందర్శించిన ఎస్పీతో వ్యాపారస్తులు మాట్లాడుతూ కార్తీకమాసం దృష్ట్యా చెర్వుగట్టు క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని రోడ్డును మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తమ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని వారు ఎస్పీకి విన్నవించారు. రోడ్డును తెరిచేందుకు తమకు అభ్యంతరం లేదని అయితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందువల్లే రోడ్డును మూసివేయడం జరిగిందని, ప్రజలు, వ్యాపారస్తులు తమతో సహకరించి ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేయడం తమ ఉద్దేశ్యం కాదని, ప్రమాదాలలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం, గాయాల బారిన పడకుండా చేసేందుకే రోడ్డును మూసివేశామని ఆయన వారితో చెప్పారు. ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అయితే తాము తీసుకునే చర్యల వల్ల సత్ఫలితాలు రావాలంటే అందరి భాగస్వామ్యం అవసరమని అన్నారు.
వ్యాపారస్తులు విజ్ఞప్తి మేరకు, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని అందరి అభ్యర్ధన మేరకు మూసివేసిన రోడ్డును తిరిగి తెరుస్తామని ఎస్పీ వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు.
అనంతరం రోడ్డు పరిస్థితి, మూసివేసిన రోడ్డు ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వ్యాపారస్తులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు ఎస్పీని కలిశారు.
Comments
Post a Comment