*ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన రెవెన్యూ సంఘాలు*
*మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారూ..?
*- అబాండాలు వేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు*
*- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపిన రెవెన్యూ సంఘాలు*
విధి నిర్వహణలో అసువులుబాసిన రెవెన్యూ ఉద్యోగుల సంతాప సభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. చనిపోయిన రెవెన్యూ ఉద్యోగులకు అన్ని రెవెన్యూ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి, టీజీటీఏ అధ్యక్షులు ఎస్.రాములు, టి.వి.ఆర్.ఒ.డబ్య్లూఏ రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు, టి.వి.ఆర్.ఒ.ఏ అధ్యక్షులు ఎన్.లక్ష్మినారాయణ, టీడీఆర్‌వీఆర్వోఏ అధ్యక్షులు రవినాయక్, టీఎస్‌వీఆర్ఏ అధ్యక్షులు వంగూరు రాములు హాజరయ్యారు.
*58 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదా..?*
ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిందని, దీంతో అనేక మంది ఉద్యోగులు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ప్రమాదాల కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. తమ శ్రమ వల్లే 58 లక్షల మంది రైతులకు భూరికార్డుల ప్రక్షాళన చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని చెప్పారు. లోపభుయిష్టమైన సాఫ్ట్‌వేర్‌తో ఎన్నో ఇబ్బందులు ఉన్నా సాధ్యమైనంత వరకు భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశామని చెప్పారు. ప్రభుత్వం ప్రపంచ రికార్డుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మలన్నసాగర్ భూసేకరణకు రెవెన్యూ ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారని, కేసులు ఎదుర్కున్నారని, ఆర్డీఓలకు జైలు శిక్ష సైతం పడిందని గుర్తు చేశారు. తాము ఇంత కష్టపడి పనిచేస్తుంటే ప్రభుత్వ పెద్ద రెవెన్యూ ఉద్యోగులపై అబాండాలు వేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అసెంబ్లీలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరును ముఖ్యమంత్రి గారు ప్రశంసించారని గుర్తు చేశారు.
*ప్రశ్నించకుండా ఉండలేం*
రెవెన్యూ ఉద్యోగులంతా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, వాటిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ శాఖకు హెచ్ఓడీ లేరని, మంత్రి లేరని, ముఖ్యమంత్రి గారిని కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. తాము ఒకప్పుడు కేసీఆర్ గారిని ఉద్యమ నేతగా, ఆయన సూచనలు పాటిస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామని చెప్పారు. ఇప్పుడు ఉద్యమ నేతనే ముఖ్యమంత్రిగా ఉన్నా తమ సమస్యలు పరిష్కారం కాకపోగా, సమస్యలను పంచుకోవద్దు, ప్రశ్నించవద్దు అనేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిగా ఇప్పుడు కూడా ప్రశ్నించకుండా ఉండలేమని అన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతున్నామని అన్నారు. తాము ప్రభుత్వానికి విధేయులమని, సమస్యలు పరిష్కరించాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
*ప్రభుత్వం వ్యతిరేక భావన వీడాలి*
ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులపై వ్యతిరేక భావన వీడి, ఇంతకుముందు స్నేహపూరితంగా పని చేయించుకోవాలని టీజీటీఏ అధ్యక్షులు ఎస్.రాములు పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతు ఉంటుందన్నారు.
*రెవెన్యూ వ్యవస్థపై కుట్రలు భగ్నం చేస్తాం*
టీవీఆర్వోఏ అధ్యక్షులు ఉపేందర్‌రావు మాట్లాడుతూ... రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవడానికి ఐక్య పోరాటానికి రెవెన్యూ సంఘాలన్నీ సిద్ధం కావాలని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రలను భగ్నం చేస్తామన్నారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర భూసర్వే జరిపించాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి కోరారు.
*సమ్మెకూ వెనకాడం*
టీవీఆర్వోఏ అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఉద్యమించాలని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రెవెన్యూ ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు.
*రెవెన్యూ ఉద్యోగుల అవమానించడం భావ్యమా..?*
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కృంగిపోతున్నది రెవెన్యూ శాఖనేనని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వో అధ్యక్షులు రవినాయక్ పేర్కొన్నారు. రాత్రింబవళ్లు పని ఒత్తిడితో తాము పని చేస్తున్నామని, అయినా తమను అవమానించడం, అబాండాలు వేయడం సరికాదన్నారు.
*రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోంది*
టీఎస్‌వీఆర్ఏ అధ్యక్షులు వంగూరి రాములు మాట్లాడుతూ... రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయి అనేక మంది ఒత్తిడితో చనిపోతున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. ఐదేళ్లు సీసీఎల్ఏ లేరని, ఏడాదిగా రెవెన్యూ మంత్రి లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నారు.
*ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు*
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏడు రెవెన్యూ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఆర్టీసీ కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సకల జనుల సమ్మె విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికులదే కీలక పాత్ర అని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చూస్తుంటే మనస్సు కలిచి వేస్తోందని, వారికి రెవెన్యూ ఉద్యోగులుగా అండగా ఉంటామని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఆర్వోఏ ప్రధాన కార్యదర్శి సుధాకర్, టీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
*రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..*
- కొత్త చట్టం రూపకల్పనలో రెవెన్యూ ఉద్యోగుల సలహాలు తీసుకోవాలి.
- రెవెన్యూ వ్యవస్థను ఇతర శాఖల్లో విలీనం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి.
-కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టూ సర్వ్ పేరుతో వివిధ జిల్లాలకు బదిలీ చేసిన ఉద్యోగులను వెంటనే వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలి.
- ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లను పాత జిల్లాలకు బదిలీ చేయాలి.
- కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు తగ్గట్లుగా సిబ్బంది నియామకం జరపాలి.
- ఖాళీలను వెంటనే భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలి.
- రెవెన్యూ ఉద్యోగులకు చట్టాలు, విధులపై శిక్షణ ఇప్పించాలి. ఇందుకోసం అకాడమీ ఏర్పాటు చేయాలి.
- సమగ్ర భూసర్వే జరిపి పూర్తిగా భూసమస్యలను పరిష్కరించాలి.
- లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిపించాలి.
Comments
Post a Comment