**చదువుల తల్లికి చెప్పుకోలేని కష్టం - నిరుపేద కుటుంబానికి శరాఘాతం**
చదువుల తల్లికి చెప్పుకోలేని కష్టం - నిరుపేద కుటుంబానికి శరాఘాతం
- 19యేళ్ల చిన్నారికి డయాలసిస్
- కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పదంటున్న వైద్యులు
- దాతల కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
చదువులో ఎంతో చురుగ్గా ఉండే ఆ అమ్మాయిని మాయదారి జబ్బు పట్టి పీడిస్తోంది. పోటీ పరీక్షల్లో బీఎస్సీ నర్సింగ్‌లో ఫ్రీ సీటు సంపాదించిన ఆ చిన్నారి రోజూ కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకోవడం లేదు. రెండు రోజులకోసారి ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటోంది. రెండు కిడ్నీలు ఫెయిలై నరకయాతన అనుభవిస్తోంది. పందొమ్మిదేళ్ల చిరు ప్రాయంలోనే వయసుకు మించిన బాధను, మానసిక వేదనను అనుభవిస్తోంది. హైదరాబాద్ సనత్‌నగర్ ప్రాంతంలో నివసించే గోపగాని మేఘన (19)కు ఇటీవల తీవ్ర అనారోగ్యం కలగడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అయితే.. వైద్యులు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారి తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది. తరోజూ కాలేజీకి కాకుండా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుండటంతో కన్నీరుమున్నీరవుతోంది.
మేఘన తండ్రి సత్యనారాయణ అమీర్‌పేట్‌లోని ఓ షాపులో పనిచేస్తున్నాడు. సత్యనారాయణకు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా పెద్దమ్మాయి హారిక ఇంటర్మీడియట్‌లోనే చదువు మానేసి.. ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటోంది. స్తోమత లేకపోవడంతో రెండో అమ్మాయి కావ్య కూడా ఇంటర్‌లోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అందరూ కలిసి చదువులో చిన్నప్పటినుంచి చురుగ్గా ఉండే చిన్నమ్మాయి మేఘనను ఉన్నత చదువులు చదివించాలని ఆశించారు. వాళ్ల ఆశలకు తగ్గట్లే మేఘన ఈయేడాది బీఎస్సీ నర్సింగ్‌లో ఫ్రీ సీటుకు అర్హత సాధించింది. కానీ.. అంతలోనే విధి వక్రించింది. సంతోషంగా కాలేజీకి వెళ్లి.. కుటుంబమంతా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలన్న ఆలోచనలో ఉన్న మేఘనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయన్న విషయం శరాఘాతంగా మారింది. కాలేజీకి వెళ్లలేని స్థితిలో ఉన్న మేఘన అనివార్యంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. మేఘన తల్లి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. బ్లడ్‌గ్రూప్ వేరు కావడంతో మేఘనకు అమర్చలేమంటున్నారు. అంతేకాదు.. మేఘన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు కనీసం పది లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు. దీంతో.. కిడ్నీ దాతల కోసం, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుల కోసం మేఘన కుటుంబం దాతల సాయాన్ని అభ్యర్థిస్తోంది. ఇప్పుడు కూడా మందులు, డయాలసిస్‌కు తమ స్థాయికి మించి ఖర్చులు అవుతున్నాయని మేఘన తండ్రి సత్యనారాయణ చెబుతున్నారు. అంతేకాదు.. మేఘన తల్లి, రెండో అక్కయ్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో.. ఆ కుటుంబాన్ని చుట్టుముట్టిన సమస్యలతో తండ్రి మానసికంగా కుంగిపోతున్నారు. చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు ఎక్కడా లేని కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురికి సరిపడే కిడ్నీ ఎవరైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. బదులుగా తాము కిడ్నీ దానం చేస్తామని చెబుతున్నారు.
మనసున్న మారాజులు స్పందించి తమ కూతురు వైద్య చికిత్స ఫలించేందుకు తోడ్పాటునందించాలని మేఘన తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మేఘనకు సాయం చేయాల్సిన దాతలు.. తండ్రి సత్యనారాయణ బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతున్నారు. 9866139641 నెంబర్‌కు గూగుల్‌పే ద్వారా సాయం చేయాలని వేడుకుంటున్నారు. అలాగే.. ఆంధ్రాబ్యాంక్ (అకౌంట్ నెంబర్ : 134210100058217 - IFSC code : ANDB0001342) బ్యాంకు ఖాతాకు విరాళాలు పంపిచాల్సిందిగా విన్నవించుకుంటున్నారు.
Comments
Post a Comment