**ప్రజల భద్రత కోసమే కార్డాన్ అండ్ సెర్చ్ : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి**
*ప్రజల భద్రత కోసమే కార్డాన్ అండ్ సెర్చ్ : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి*
నల్గొండ : సంఘ విద్రోహక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించడమే కార్డాన్ అండ్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమని నల్గొండ డిఎస్పీ జి. వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.
ఆదివారం తెల్లవారు జామున 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు రెండు గంటల పాటు నల్గొండ పట్టణంలోని బస్ స్టాండ్, సతీష్ నగర్ ప్రాంతాలలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి వివరాలు పూర్తిగా తీసుకోవాలని, ఆదార్ గుర్తింపు కార్డు జీరాక్స్ తీసుకోవడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. లాడ్జీల నిర్వహకులు సైతం గదులు అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులకు గదులు ఇవ్వకూడదని చెప్పారు. గదులు అద్దెకు తీసుకునే వారిలో ఎవరైనా అనుమానం కలిగించే విధంగా ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ద్వారా ప్రజలలో భద్రతా భావం పెరుగుతుందని చెప్పారు. నల్గొండ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంటూ నిరంతర నిఘా, పెట్రోలింగ్ వాహనాలతో పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు.
కార్డాన్ అండ్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, 4 గ్యాస్ సిలిండర్లు, రెండు బస్తాల గుట్కా ప్యాకెట్లు సీజ్ చేయడంతో పాటు అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు. కార్డాన్ సెర్చ్ లో డిఎస్పీతో పాటు నలుగురు సిఐలు, పది మంది ఎస్.ఐ.లు, 12 మంది ఏ.ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్స్, 60.మంది కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు పాల్గొన్నారు.
Comments
Post a Comment