**ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష**

.


*ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష*


క్షేమంగా దేశానికి రప్పించండి..


విదేశాంగ శాఖమంత్రిని కోరిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు


 శ్రీకాకుళం రూరల్‌ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే వ్యక్తికి ఈజిప్ట్‌ న్యాయస్థానంలో మరణ శిక్ష పడింది. ఆయన పనిచేస్తున్న షిప్‌లో మాదకద్రవ్యాలు లభించడమే ఇందుకు కారణం. 2016 డిసెంబరు 18న ఆయన ఈజిప్ట్‌ పోలీసులకు పట్టుబడగా ఇటీవలే విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్‌ చదువుకున్న రమణ విశాఖలోని ఎస్‌కేడీ కంపెనీకి చెందిన వర్మ అనే ఏజెంట్‌ ద్వారా విదేశాల్లో సీమెన్‌గా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇందుకుగాను రూ.4 లక్ష లు చెల్లించాడు. 2016 సెప్టెంబరులో ముంబాయి నుంచి ఇరాన్‌కు విమానంలో వెళ్లాడు. అక్కడ ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అబ్బాన్‌ సిరదౌసీ కంపెనీకి చెందిన షిప్‌లో సీమెన్‌గా చేరాడు. సంబంధిత షిప్‌ ఈజిప్ట్‌ జలాల్లోకి ప్రవేశించగా.. అక్కడి పోలీసులు తనిఖీ చేయగా నిషేధిత మాదక ద్రవ్యాలు దొరికాయి. ఈ కేసులో రమణను అరెస్ట్‌ చేయగా అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించినట్టు తెలిసింది. కాగా రమణ విదేశాలకు వెళ్లిన నాటి నుంచి ఆయన ఆచూకీ లేదు. సంబంధిత ఏజెంటును ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో కుటుంబసభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించడంతో ఏపీ పోలీస్‌ ఎన్నారై విభాగం నుంచి ఒక సమాచారం వచ్చింది. రమణ ఈజిప్ట్‌ పోలీసులకు పట్టుబడడంతో న్యాయస్థానంలో మరణశిక్ష పడినట్టు వెలుగులోకి వచ్చింది.


అప్పటి నుంచి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు. గురువారం బాధిత కుటుంబసభ్యులను తీసుకెళ్లి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఇందులో రమణ తప్పు లేదని..సంబంధిత షిప్‌ యాజమాన్యం చేసిన తప్పిదానికి రమణ బలయ్యాడని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడి రాయభార కార్యాలయంతో మాట్లాడి బాధితుడికి తిరిగి దేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఫోన్‌లో తెలిపారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్