**భారీ ఉగ్రదాడులకు వ్యూహం**
న్యూఢిల్లీ : భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్‌లో ఇటీవల ఖలిస్తాన్ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్ ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్‌లు పాక్ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఖలిస్తాన్‌కు మద్దతిచ్చే ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు భద్రతా దళం, ఎన్‌ఐఏ, రా, ఐబీ వర్గాలను ఆదేశించింది.
మరోవైపు పంజాబ్‌లోకి ఆయుధాలు తరలిరాకుండా పంజాబ్ సరిహద్దుల వద్ద భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఉగ్రదాడులు చేపట్టేందుకు ఖలిస్తాన్‌ను కాంక్షించే ఉగ్రవాదులు చేపడుతున్న శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు యూపీలోని అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ యోచిస్తోందని నిఘా వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయోధ్యలో ఉగ్రదాడికి జైషే మహ్మద్ సన్నాహాలు చేస్తున్నట్టు ఉగ్రసంస్థ కమ్యూనికేషన్ కోసం వాడుతున్న చాటింగ్ యాప్ టెలిగ్రాం ద్వారా నిఘా వర్గాలు పసిగట్టాయి.
Comments
Post a Comment