**వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది -  పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్**

వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది -  పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్


వినియోగదారులకు తమ హక్కులు, చట్టాల పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ అన్నారు. చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల వినియోగదారులు సరైన న్యాయం పొందలేకపోతున్నారని, మోసపోతే చట్టం తనకు అండగా ఉందనే నమ్మకం వినియోగదారులకు కలిగించాలని అన్నారు.
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పారసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు.  హైదరాబాద్లో  జరిగిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ  చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల, పరిష్కారాల  కమిషన్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.కె. జైస్వాల్, పౌరసరఫరాల శాఖ కమిషనర్  పి. సత్యనారాయణరెడ్డి, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బి. బాలమాయాదేవి తదితరులు  పాల్గొన్నారు. 
వినియోగదారులు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన వాల్పోస్టర్ను ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా, ఏ సేవ పొందినా ఏ ఒక్క వినియోగదారుడు కూడా నష్టపోకూడదు. వినియోగదారులు వారి హక్కులు పట్ల, వారి బాధ్యతల పట్ల చైతన్యం కలిగినప్పుడే మోసాలకు త్వరితగతిన అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వానికి మార్గం సులువవుతుందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు.
ప్రస్తుత కాలానికి అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019ని తీసుకొచ్చిందని, ఈ చట్టం వినియోగదారులకు మరింత రక్షణ కల్పిస్తుందన్నారు. ఆన్లైన్ అమ్మకాలు, టెలీ షాపింగ్, మల్టీ మార్కెటింగ్, ప్రత్యక్ష అమ్మకం లాంటివన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు. గత చట్టంతో పోలిస్తే 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనేక విధాలుగా విశిష్టమైనదని, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించే విధంగా ఉన్నది. వినియోగదారులకు నష్టం జరిగినప్పుడు జవాబుదారులను, కారకులను జరిమానాలతోనే సరిపెట్టకుండా కఠిన శిక్షలు, జైలుకు పంపడానికి కూడా వెనుకాడని విధంగా కొత్త చట్టం ఉందని తెలిపారు. ఈ చట్టం పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నట్టే.. ప్రతి పౌరుడికి తాను కష్టపడి సంపాదించిన సొమ్ము దోపిడీకి గురికాకుండా ఉండేలా అనేక హక్కులు, చట్టాలు ఉన్నాయని, నష్టం జరిగితే, మోసపోతే పరిహారం పొందడానికి అవకాశం ఉందన్నారు. న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరంలు ఉన్నాయని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019లో వినియోగదారులకు మరిన్ని హక్కులను కల్పించిందన్నారు.
కేవలం హక్కులు కల్పించడంతోనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడినట్టు కాదనీ, ఆ హక్కులను పరిరక్షించినప్పుడు, అమలు చేసినప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుందని, ఆ దిశగా మనమనందరం కృషి చేసి వినియోగదారుడికి అండగా నిలబడాలన్నారు. 
పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సాధారణ కోర్టుల వలే కాకుండా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదికలు సత్వర న్యాయాన్ని అతి తక్కువ ఖర్చుతో పొందే వీలును కల్పిస్తున్నాయని, ఇందుకు పౌరసరఫరాల భవన్లోని వినియోగదారుల వ్యవహారాల విభాగం (రిడ్రెసల్ సెల్) ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. 
అక్రమ వ్యాపారాలు, మోసపూరిత సేవల దోపిడీకి గురికాకుండా వినియోగదారులకు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకురావడమే కాకుండా, ఉచితంగా సమస్యలను పరిష్కరించి ఎంతోమంది బాధితులకు నష్టపరిహారం ఇప్పించి వారికి అండగా నిలుస్తుందన్నారు. దీంతో ఈ విభాగాన్ని ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల వివాదాల పరిష్కారానికి 12 జిల్లా ఫోరమ్స్ పనిచేస్తున్నాయి. ఈ కేంద్రంలో ఇప్పటివరకు నేరుగా దాదాపు 1530 కేసులు నమోదు కాగా, 1332 కేసులు వినియోగదారులకు సానుకూలంగా పరిష్కారమయ్యాయి. 
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల, పరిష్కారాల కమిషన్ ప్రెసిడెంట్ జస్టిస్ ఎం.ఎస్.కె. జైస్వాల్  గారు మాట్లాడుతూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్లో ఇప్పటివరకు 6,955 కేసులు నమోదు కాగా 3,813 కేసులను, అలాగే రాష్ట్రంలోని 12 జిల్లా ఫోరంలలో ఇప్పటివరకు 96,502 కేసులు నమోదు కాగా 91,309  కేసులను పరిష్కరించామని తెలిపారు. 
వస్తు సేవల విలువ కోటి రూపాయల లోపు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. కోటి రూపాయల నుండి పది కోట్ల వరకు ఉన్న వస్తు సేవల గురించి అయితే హైదరాబాద్లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ను ఆశ్రయించవచ్చు. వస్తు సేవల విలువ పది కోట్లకి మించి ఉన్నట్లతే నేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్లో కేసు ఫైల్ చేయవచ్చని అన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్