**దిగివస్తున్న ఉల్లి ధరలు..**
దిగివస్తున్న ఉల్లి ధరలు..
హైదరాబాద్ : కొన్ని రోజులుగా వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు కొద్దికొద్దిగా దిగి వస్తున్నాయి. నెల రోజుల క్రితం క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో 12,000 నుంచి 13,000 రూపాయలు పలుకగా సోమవారం క్వింటాల్‌కు 8,500 నుంచి 9 వేల రూపాయలు పలికింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనూ కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రెండు నెలల ధరలతో పోలిస్తే దాదాపు కిలోకు 50 నుంచి100 రూపాయలు తగ్గినట్టేనని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి హోల్‌సేల్ మార్కెట్‌లకు ఉల్లి దిగుమతులు బాగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 లారీల వరకు వస్తున్నాయని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ, ఎపి తో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా నగరానికి ఉల్లి దిగుమతి పెరిగింది. మరో వారం రోజుల్లో గుజరాత్ నుంచి ఉల్లిగడ్డ నగరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ లెక్కన మరో 15 రోజుల్లో ఉల్లి ధరలు సాధారణ స్ధితికి వస్తాయని హోల్‌సేల్ ఉల్లి వ్యాపారి ధరణికోట సుధాకర్ వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్‌కు ఉల్లి కొత్తపంట రాక మొదలైందని తెలిపారు.
Comments
Post a Comment