**ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతులు లేవు : ఎస్పీ రంగనాధ్**
*ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతులు లేవు : ఎస్పీ రంగనాధ్*
- - ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదు
- - అంగీకరించిన ముస్లిం మత పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల జె.ఏ.సి.
- - నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
- - ర్యాలీలో పేరుతో యువతను ప్రేరేపించే విధంగా రాజకీయ లబ్దికి ప్రయత్నించవద్దు
- - బహిరంగ సభ దృష్ట్యా పట్టణమంతా 144 సెక్షన్ అమలు
నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని, ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు.
గురువారం ఆయన ఛాంబర్ పోలీస్ అధికారులు, ముస్లిం మత పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ముస్లిం సంస్థలు, జె.ఏ.సి. ఎన్.ఆర్.సి. సిఏఏ కు నిరసనగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ క్రమంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ర్యాలీలు ఎట్టి పరిస్థితులలో అనుమతించడం జరగదని ఆయన చెప్పారు. ఇందుకు సమావేశంలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి అంగీకరించారు. ర్యాలీలో యువతను ప్రేరేపించే విధంగా వ్యవహరించి రాజకీయ ప్రయోజనాలు, లబ్దికి వాడుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులతో సహకారించాలని వారిని కోరారు. ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు, జె.ఏ.సి.లు ముందుగా నిర్దేశించిన విధంగా బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతించడం జరిగిందని, అందుకు అనుగుణంగా భాస్కర్ టాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాత్రమే సభ నిర్వహించుకోవాలని ఎస్పీ రంగనాధ్ స్పష్టం చేశారు. బహిరంగ సభ నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు*
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్రమంలో ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కేసులలో చిక్కుకోవద్దని ఆయన కోరారు. కేసులు నమోదు అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు, బయటి దేశాలకు వెళ్ళడానికి పాస్ పోర్ట్ సైతం జారీ చేయడం జరగదని వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు.
సమావేశానికి హాజరైన ముస్లిం సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జె.ఏ.సి. నేతలు సానుకూలంగా స్పందించి పోలీసులతో సహకరిస్తామని, ఎలాంటి ర్యాలీలు నిర్వహించమని హామీ ఇచ్చారు.
సమావేశంలో డిఎస్పీలు జి. వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, సిఐలు నిగిడాల సురేష్, మహబూబ్ బాషా, సురేష్ బాబు, సత్యం, ఎస్.ఐ.లు నర్సింహా, హన్మంత రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు అహ్మద్ ఖలీమ్, జమాల్ ఖాద్రీ, సయ్యద్ హశం, సలీమ్, పాలడుగు నాగార్జున, పుచ్చకాయల నర్సిరెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు తదితరులున్నారు.
Comments
Post a Comment