**వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వి. చంద్రశేఖర్**
*వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ వి. చంద్రశేఖర్*
- - జిల్లాలో ఇక హెల్మెట్ వినియోగం తప్పని సరి : ఎస్పీ రంగనాధ్
- - మైనర్లకు వాహనాలు ఇస్తే వాహనాలు సీజ్, రిమాండ్ తప్పదని ఎస్పీ హెచ్చరిక
- - లైసెన్స్, వాహనాల ధ్రువపత్రాలు తనిఖీకి ప్రత్యేక చర్యలు
- - అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే అధిక రోడ్డు ప్రమాదాలు
నల్లగొండ : వాహనాల వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదల శాతం తగ్గుతుందని నల్గొండ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు.
31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక లక్ష్మీ గార్డెన్స్ లో నల్గొండ ట్రాఫిక్ సి.ఐ. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆటో, ట్యాక్సీల డ్రైవర్లు, ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు, యువత, పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించే విధంగా నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారితో పాటు అతనిపై ఆధారపడిన కుటుంబం, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. వాహనం యొక్క వేగ పరిమితికి అనుగుణంగా, రోడ్డు పై సూచించిన వేగ నియంత్రణ పాటించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరగకుండా నియంత్రించవచ్చని తెలిపారు. అదే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున చేపట్టనున్నామని తెలిపారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారని అయితే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అప్పుడే ఆ సంఖ్య తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్పీ రంగనాధ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు అతి వేగం ప్రధానమైన కారణంగా మారిందని, అనేక రోడ్డు ప్రమాదాలలో అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, మద్యం సేవించి వాహనాలు నడిపే క్రమంలో ప్రమాదాల సంఖ్యలో పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ జరిగిన ప్రమాదాల సంఖ్య సైతం ఇటీవల పెరిగిందని ఆయన చెప్పారు. డ్రైవింగ్ అనేది శ్రద్ధతో నిర్వహించాల్సిన ప్రక్రియ అని ఆ సమయంలో సెల్ ఫోన్, ఇతర అంశాలపై ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమారుడు, నల్గొండ జిల్లాలో మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి అతివేగమే కారణంగా నిలించిందని ఆయన గుర్తు చేశారు. ప్రయాణం చేసే సమయంలో వేగం కన్నా మనం చేరుకోవాల్సిన గమ్యంపై శ్రద్ద చూపాలని అదే సమయంలో మన మీద ఆధారపడిన కుటుంబం గురించి ఆలోచించి వాహనాలు నడపాలని ఆయన సూచించారు.
*జిల్లాలో హెల్మెట్ వినియోగం ఇక తప్పని సరి : ఎస్పీ*
నల్గొండ జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నట్లుగా గుర్తించామని, వారి ప్రాణాలను రక్షించడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయడంతో పాటుగా ఎవరు వాహనం నడిపినా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా మైనర్లకు ఎట్టి పరిస్థితులలో వాహనాలు ఇవ్వకూడదని, అలా ఎవరైనా చేస్తే వాహనం యజమానిని సైతం బాద్యులను చేస్తూ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా రిమాండ్ కు తరలిస్తామని హెచ్చరించారు. అందువల్ల మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా వారి తల్లితండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. లైసెన్స్, వాహనం యొక్క పత్రాలు లేకుండా వాహనం నడిపితే దానిని దొంగ వాహనంగా గుర్తించడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాలోని అన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా ఆ ప్రాంతలాలో జరిగే రోడ్డు ప్రమాదాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల సంఖ్యను, శాతాన్ని తగ్గించే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు, రోడ్డు దాటే పాదచారులే అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని తాము గుర్తించామని అందువల్ల ఈ రెండు అంశాలపై దృష్టి సారిస్తే 50 శాతానికి పైగా ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల నివారణలో ఎక్కువ బాధ్యత వహించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
*త్వరలో ఆర్టీఏ, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా*
జిల్లాలో అధిక సంఖ్యలో వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని గుర్తించామని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమని ఆయన తెలిపారు. జిల్లాలో లైసెన్స్ తీసుకోవడానికి చాలా మంది వాహనదారులు పడుతున్న ఇబ్బందులు, అవగాహన లేమి అంశాలను పరిగణనలోకి తీసుకొని రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో *లైసెన్స్ మేళా* నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సమావేశానికి హాజరైన డ్రైవర్లు, విద్యార్థులు, యువతతో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బాధ్యతాయుతంగా ఉంటామని, వేగంగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తామని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి వాహనాలు నడుపుతామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై పాటల రూపంలో ఆలపించిన గేయాలు అందరిని అలరించాయి.
గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలలో చనిపోయిన ప్రయాణికులు, ప్రమాదాలు జరగడానికి కారణాలను వివరిస్తూ ఎల్.ఇ. డి. స్క్రీన్ ద్వారా వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పించారు.
31వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్బంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ట్రాఫిక్ సిబ్బందికి, సామాజిక కార్యకర్తలకు జిల్లా ఎస్పీ రంగనాధ్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందచేశారు.
అనంతరం రోడ్డు ప్రమాదాలపై రూపొందించిన *అతివేగం ప్రాణాలు తీస్తుంది* పాటల సి.డి.ని ఎస్పీ ఆవిష్కరించి పాటలు రూపొందించిన నల్లగొండ నాగిల్ల కొండల్, గాయకుడు షేక్ బాబాలను అభినందించారు.
కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, ట్రైనీ ఐపీఎస్ వైభవ్ గైక్వాడ్, ఆర్.టి.ఏ. వెంకట్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అల్లు పుల్లారావు, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ సురేష్ బాబు, డిటిఆర్బీ సిఐ అంజయ్య, ఎస్.ఐ. కొండల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది స్వామి, తూడి సుధాకర్, చలపతి రెడ్డి, శ్రీశైలం, జలీల్, లక్ష్మీ నారాయణ, నర్సింహా, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సోమయ్య, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్, ఆర్టీసీ, జాతీయ రహదారుల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment