ప్రధానమంత్రి సడక్ యోజన - వెయ్యి కిలోమీటర్ల నిడివికి రూ.620 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు
ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద వెయ్యి కిలోమీటర్ల నిడివికి రూ.620 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అనుమతులు తెలిపింది. రాష్ట్రానికి కేటాయించిన 2,427 కి.మీలలో మిగిలిన 1,427కి.మీ. నిడివికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అలాగే ఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద ఉపాధి హామీ కూలీల సంఖ్య కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలోనూ రోజుకు 6లక్షలకు చేరడం శుభ పరిణామం. మరో వారం రోజుల్లో వ్యవసాయ పనులు ముగుస్తున్నందున ఈ సంఖ్య 10లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ దశలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు అత్యంత సేఫ్టీగా ఉండే పద్ధతుల్లో రక్షణ కల్పించాలి. మంచినీరు, మాస్కులు అందించాలి. సమర్థవంతంగా పనులు జరిగేలా చూడాలి. నిరంతరం అధికారులు ఆయా పనులను పర్యవేక్షించాలి. అని రాష్ట్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి, హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలోని తన నివాసంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, పిఎంజిఎస్ వై సిఇ రాజశేఖరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం, ఫేజ్-3 కింద మన రాష్ట్రానికి 2,427కి.మీ. మేర కేటాయింపులు జరిగాయన్నారు. అందులో బ్యాచ్-1 కింద వెయ్యి కి.మీ.కు రూ.620 కోట్లకు కేంద్రం ప్రాథమిక అనుమతులిచ్చిందిన్నారు. ఆ నిధులను రెండు మూడు రోజుల్లో విడుదల అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, బ్యాచ్-2 కింద 1,427 కి.మీ. నిడివికి కేంద్ర అనుమతులు లభించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇక ఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి భయంలోనూ ఉపాధి హామీ పనులు జోరుగానే సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ సమయంలో రోజుకు 6 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారన్నారు. ఇది ఆహ్వానించదగిన శుభపరిణామమని మంత్రి చెప్పారు. ఈ సీజన్ వ్యవసాయ పనులు మరో వారం పది రోజుల్లో ముగుస్తాయని, ఆ తర్వాత ఉపాధి హామీ పనుల జోరు మరింత పెరుగుతుందని మంత్రి ఎర్రబెల్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీల సంఖ్య రోజుకు 10లక్షలకు చేరుతుందన్నారు. అయితే, ఉపాధి హామీ కూలీలకు మాస్కులు, మిషన్ భగీరథ మంచినీరు అందించాలని, కరోనా నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించేలా సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలని మత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.ఇక పంచాయతీరాజ్ పారిశుద్ధ్య కార్మికులకు బ్లీచింగ్ పౌడర్, ఇతర పారిశుద్ధ్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, మంచి పని వాతావరణం ఉండాలని, వీళ్ళకి కూడా మాస్కులు-మిషన్ భగీరథ మంచినీటిని అందించాలని అధకారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ప్రభుత్వం ఈ మధ్యే కేటాయంచిన రూ.307 కోట్ల నుంచి నిర్దేశిత ఖర్చులను జాగ్రత్తగా వృథా కాకుండా చేయాలని మంత్రి సూచించారు. ఆయా పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి చెప్పారు.కరోనా నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు పని దినాల కల్పన, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు మంచి సానిటేషన్, మాస్కులు, మంచినీరు, ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.
Comments
Post a Comment