రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు, భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలి- ఎస్పీ రంగనాధ్
రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు,
భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలి- ఎస్పీ రంగనాధ్
రెడ్ జోన్ల పరిధిలో ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు
అన్నదానం చేసే వ్యక్తులు, సంస్థలను పార్సిల్స్ పద్ధతిలో మాత్రమే అనుమతిస్తాం
లాక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కేసులు తప్పవు
ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు మరింత బాధ్యతాయుతంగా సహకరించాలి
లాక్ డౌన్ పటిష్ట అమలుకు పోలీసులతో సహకరించండి
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆదేశాల మేరకు బుధవారం నుండి రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
కోవిడ్ - 19 వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ - 19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను పోలీస్ శాఖ చేపడుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు అనుమతించడం జరగదని, అదే సమయంలో ఎవరైనా బారికేడ్లు దాటుకుని వచ్చినా, నిబంధనలను అతిక్రమించినా కేసులు నమోదు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని, ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో కఠిన చర్యలకు వెనుకాడబోమని ఆయన తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలు కోవిడ్ - 19 వ్యాప్తి నియంత్రణ, ప్రజల ప్రాణాలను రక్షించడం కోసమేనని అందువల్ల ప్రజలంతా పోలీసులతో సహకరించాలని ఎస్పీ కోరారు.
కరోనా కట్టడి నేపథ్యంలో అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సమావేశాలు ఏర్పాటు చేయకుండా, ఎక్కువ మంది కార్యకర్తలతో తిరగకుండా మరింత బాధ్యతాయుతంగా సహకరించాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు.
జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక చోటుకు భోజనం తీసుకువచ్చి ప్లేట్లలో భోజనం పెడుతున్నారని ఇకపై ఈ విధానాన్ని అనుమతించబోమని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. జిల్లాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్చంద, ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు, వ్యక్తిగతంగా దాతృతంతో సేవ చేస్తున్న ఎవరికి తాము వ్యతిరేకం కాదని, భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు. ప్లేట్స్ లో భోజనం పెట్టే విధానంలో ఎక్కువ మంది ఒకే దగ్గరకు చేరుకోవడం, సామాజిక దూరం పాటించకపోవడం లాంటి కారణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా జరిగే ప్రమాదం ఉన్నదని అందువల్ల బుధవారం నుండి కేవలం పార్సిల్స్ విధానంలో మాత్రమే అన్నదాన కార్యక్రమాలు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్నదానం చేసే వారు విధిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు వాడాలని చెప్పారు. అదే విధంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసే సమయంలోనూ ఎక్కువ మంది లేకుండా చూసుకోవాలని, విధిగా సామాజిక దూరం పాటించి కార్యక్రమాలు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్నదానం, నిత్యావసరాలు పంపిణీ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటూ వైరస్ వ్యాప్తి నియంత్రణలో సహకరించాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు.
Comments
Post a Comment