పోలీస్ శాఖ గౌరవం పెంచడంలో డయల్ 100 సిబ్బంది కీలకం : అదనపు ఎస్పీ నర్మద
*పోలీస్ శాఖ గౌరవం పెంచడంలో డయల్ 100 సిబ్బంది కీలకం : అదనపు ఎస్పీ నర్మద*
- - డయల్ 100 సిబ్బంది పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి
- - విజిబుల్ పోలీసింగ్, ఘటనా స్థలాలకు త్వరితంగా చేరుకునేలా చర్యలు
- - డయల్ 100 పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
నల్లగొండ : పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంచడంలో డయల్ 100 సిబ్బంది పనితీరు చాలా కీలకమని దానిని దృష్టిలో ఉంచుకొని మరింత సమర్ధవంతంగా పని చేయాలని అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద అన్నారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్ 100 సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయల్ 100 సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఘటనా స్థలాలకు సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆమె చెప్పారు. డయల్ 100 సిబ్బంది ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకోవడం ద్వారా అక్కడి పరిస్థితులను అదుపు చేయడం, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం, ఘటనకు బాద్యులైన వారిని అదుపులోకి తీసుకోవడం లాంటి చర్యల ద్వారా పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న బ్లూ కోట్స్, డయల్ 100ల ద్వారా పోలీసుల పట్ల ప్రజలలో పెరిగిన గౌరవాన్ని మరింత పెంచే దిశగా వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. డయల్ 100, బ్లూ కోట్స్ సిబ్బంది నల్లగొండ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. ఇకపై డయల్ 100 పనితీరుపై నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు ఆమె వివరించారు.
సమావేశంలో ఐటి సెల్ సిఐ రౌతు గోపి, డయల్ 100, బ్లూ కోట్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment