గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం
*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం*
మార్చి 14వ తేదీన జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండువిడతల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారని అన్నారు. పోలింగ్ నిర్వహణ కొరకు సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, పోలింగ్ సిబ్బందికి రెండు విడతలలో మార్చి 2 వ తేదీ మరియు 9వ తేదీలలో ఆయా జిల్లా కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు జిల్లా కేంద్రాలలో జరిగే ఇట్టి శిక్షణా కార్యక్రమంలో ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిబంధనలు, పోలింగ్ ముందురోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ స్వీకరించి, పరిశీలించుకోవడం, పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల వినియోగం, బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కొరకు సిద్ధం చేసుకోవడం, ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే విధానం, ఓటింగ్ రహస్యాన్ని కాపాడడం, నిర్దేశించిన సమయాలలో పోలింగ్ ను ప్రారంభించి, ముగించడం, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను సీలు వేయడం, ఎన్నికల పత్రాలను పూరించి, సీలు వేసి, రిసెప్షన్ కేంద్రంలో అప్పగించడం తదితర అన్ని అంశాలపై మాస్టర్ ట్రైనర్ లు సవివరంగా శిక్షణ ను అందించాలని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహణ కు చేపట్టవలసిన జాగ్రత్తలను ఎన్నికల సంఘం సూచించిందని, వాటిని కూడా పాటించాలని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీఆర్వో యన్. జగదీశ్వర్ రెడ్డి, శిక్షణా నోడల్ అధికారి
రాజ్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, వి.రమేష్, డి. బాలు, జానారెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment