రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్*
*రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : డిఐజి రంగనాధ్*
- - నాణ్యత, మాయిశ్చర్ లాంటి సాకులతో మద్దతు ధర తగ్గిస్తే సహించేది లేదు
- - మద్దతు ధర 1,888, సాధారణ ధాన్యంకు 1,868 చెల్లించాలి
- -.మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపితే సహించేది లేదు
- - రేపటి నుండి రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
నల్లగొండ : నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, మాయిశ్చర్, తాలు, మట్టి లాంటి అంశాలను సాకుగా చూపిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డిఐజి ఏ.వి. రంగనాధ్.
గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్వింటాలుకు కొన్ని కిలోలను తగ్గింపు లాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు సంబందిత మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రైతులకు క్వింటాలుకు 1,888 మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అదే సమయంలో సాధారణ ధాన్యంకు 1,868 రూపాయలు చెల్లించాలని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.
*రేపటి నుండి టాస్క్ ఫోర్స్ తనిఖీలు*
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతాంగం మోస పోకుండా ఉందడం లక్ష్యంగా పోలీస్, రెవిన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతాంగానికి అన్యాయం జరిగేలా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
*ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురండి*
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరిగినా, మోసం చేసేందుకు ప్రయతించినా, తూకం, మాయిశ్చర్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినా రైతులు నేరుగా తన మొబైల్ *9440795600* కు వాట్స్ అప్, ఎస్.ఎం.ఎస్. ద్వారా లేదా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన రైతులను కోరారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, రైతాంగానికి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని డిఐజి రంగనాధ్ తెలిపారు.
Comments
Post a Comment