*చిన్న పత్రికలను విస్మరించడం* *సరైంది కాదు* *-టీయూడబ్ల్యూజే నేత విరాహత్*
*చిన్న పత్రికలను విస్మరించడం* *సరైంది కాదు*
*-టీయూడబ్ల్యూజే నేత విరాహత్*
------------------------------------------
హైదరాబాద్:
ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి కొట్లాడిన చిన్న, మధ్యతరగతి పత్రికల ప్రచురణకర్తలను విస్మరించడం సరైంది కాదని, వారికి న్యాయం జరిగేంతవరకు తాము అండగా నిలిచి పోరాడుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు.
సోమవారం నాడు లోవర్ ట్యాంక్ బండ్ లోని టీయూడబ్ల్యూజే కేంద్ర కార్యాలయంలో తెలంగాణ చిన్న, మధ్యతరగతి మరియు మేగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ఉప ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్ తో పాటు పలు పత్రికల సంపాదకులు టీయూడబ్ల్యూజేలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విరాహత్ అలీ పాల్గొని మాట్లాడారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం చిన్న పత్రికలకు పక్షపాతిగా నిలబడి పోరాడుతుందన్నారు. ప్రభుత్వం నియమించే అక్రెడిటేషన్ కమిటీల్లో చిన్న పత్రికలకు ప్రాతినిధ్యం దక్కడం తమ సంఘం ఘనతేనని విరాహత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావంతో తమ కష్టాలకు మోక్షం లభిస్తుందని ఆశించిన చిన్న, మధ్యతరగతి పత్రికలను ప్రభుత్వం నిరుత్సాహపరిచే వైఖరికి స్వస్తి పలికి న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్ గ్రెడేషన్ జీఓతో పాటు చిన్న పత్రికలకు రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ తీర్మానం ప్రకారం వెంటనే అదనంగా అక్రెడిటేషన్లు మంజూరీ చేయాలని విరాహత్ డిమాండ్ చేశారు. తెలంగాణ చిన్న, మధ్యతరతి పత్రికలు మరియ మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణలు మాట్లాడుతూ పోరాట పటిమ కలిగివున్న ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘాల గొడుగు క్రింద న్యాయం జరుగుతుందనే విశ్వాసంతోనే తాము వాటికి అనుబంధంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి ఏ.రాజేష్, హెచ్.యు.జే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment