ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌


 ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌ 

 

హైదరాబాద్‌: రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచాను.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు.


స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని కేటీఆర్‌ అన్నారు. షోయబ్‌ ఉల్లా ఖాన్‌ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. ఉద్యమ రోజుల్లో పత్రికా యాజమాన్యాలు తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవని గుర్తుచేశారు. జర్నలిజం ముసుగులో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు, బూతులు తిడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.


టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచింది జర్నలిస్టులే..

యాజమాన్యాలు ఎలా ఉన్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడింది తెలంగాణ జర్నలిస్టులేనని చెప్పారు. స్టింగర్ల నుంచి డెస్క్‌ వరకు తమకు సపోర్టుగా నిలబడటంతోనే తెలంగాణ సాధించగలిగామన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీదాక వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్‌ ఏనాడు తగ్గించలేదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్‌ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.


మున్సిపల్‌ శాఖ థాంక్‌ లెస్‌ జాబ్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 22 వేల మంది పారిశుధ్య సిబ్బంది రెక్కలు ముక్కలు చేసుకున్నా చిన్న అభినందన రాదని వ్యాఖ్యానించారు. రెండు కాలనీల్లోకి నీళ్లు రాగానే హైదరాబాద్‌ నీట మునిగిందని రాస్తారని విమర్శించారు. అతిశయోక్తి అలంకారం గురించి తనకు తెలుసని, దాన్ని ఎంతలా వాడుకోవాలో అంతే వాడాలని సూచించారు.


మన మన్‌ కీ బాత్‌ మోదీ వింటారా?

పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదు.. చదివితే ఏది నిజమో తెలియదన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందన్నారు. భారత ప్రధాని చేసిన ఒత్తిడి వల్ల అదానీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందన్నారు. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టుపై ఏ ఒక్క మీడియా అయినా అక్కడికి వెళ్లి నిజానిజాలు నిగ్గుతేల్చిందా అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా మోదీ మన్‌ కీ బాత్‌ మనం వినాల్సిందే.. ఆయన మన మన్‌ కీ బాత్‌ వింటారా అని ఆగ్రహంవ్యక్తంచేశారు. నచ్చని జర్నలిస్టులకు చంపేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు.


ఇవేవీ వార్తలు కాదా?

9 బిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్‌ ఉత్పత్తి చేసిందని, కరోనా వ్యాక్సిన్ల గురించి మన మీడియా ఎందుకు హైలెట్‌ చేయలేదని వాపోయారు. జో బైడెన్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా హైదరాబాద్‌లోనే తయారయిందన్నారు. మిషన్‌ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడంలేదన్నారు. చెరువు కట్టలు తెగితే వార్తకానీ.. బలంగా ఉంటే వార్త కాదా అని ప్రశ్నించారు. భూగర్భ జలాలు లేకుంటే వార్త కానీ, భూగర్భ జలాలు పెరిగితే ప్రచురణార్హం కాదా అని వ్యాఖ్యానించారు.


‘పాలు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో రికార్డులు సృష్టించాం. ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్నది. పల్లె ప్రగతి, పట్టణప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ వార్తలు కాదా?.. హైదరాబాద్‌లో 7 శాతానికి పైగా గ్రీన్‌ కవరేజ్‌ పెరిగింది.. దీనికి పతాక శీర్షిక ఉండదా?. ఏ మీడియాలో అయినా పాజిటివ్‌ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నది. సోషల్‌ మీడియానా లేదా యాంటీ సోషల్‌ మీడియానా అర్థం కావడంలేదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్