పదేండ్ల తెలంగాణలో దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? - కప్పర
పదేండ్ల తెలంగాణలో దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? జై తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ నినాదం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెల, భూమి బద్దలయ్యేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదమది. అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఇక ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు. దగా పడ్డది ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హాలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమం లో భగస్తులను చేసింది జర్నలిస్టులు. సర్వరోగ నివారిణి జిందా తిలస్మాత్ అన్న చందంగా అన్ని సమస్యలకు తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం. మనం ఏది అనుకున్నామో , ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాము. ...