పదేండ్ల తెలంగాణలో దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? - కప్పర


 పదేండ్ల తెలంగాణలో 


దందుకున్నది ఎవరు?

దగా పడ్డది ఎవరు.?


జై తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ నినాదం.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెల, భూమి బద్దలయ్యేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదమది.

అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఇక ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది.

పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు. దగా పడ్డది ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది.

తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హాలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమం లో భగస్తులను చేసింది జర్నలిస్టులు. సర్వరోగ నివారిణి జిందా తిలస్మాత్ 

అన్న చందంగా అన్ని సమస్యలకు తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం. మనం ఏది అనుకున్నామో , ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం.

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాము. 1969 నుంచి పోరాటం ఉన్నా దానికి రాజకీయ ఆలోచన లేని కారణంగా తెలంగాణ పోరాటం ఎప్పటికప్పుడు అణిచివేయబడుతుందని భావించా ము.

అధికారం కోసం, అందలం కోసం కాచుకుని కూర్చున్న

ఓ ప్రాణికి బలాన్ని ఇచ్చాం. బలవంతుడిని చేసాం.

ఉద్యమ నినాద మంత్రాన్ని ఉపదేశించి తెలంగాణ బాహుబలిని చేసాం. 

ఉద్యమకారులుగా మనకు ఎన్ని అవమానాలు ఎదురైనా, తెలంగాణ కోసం అన్నింటిని దిగమింగి మన అందరి బలాన్ని ఒక్కనికే ఇచ్చి, మన మస్తిష్కాన్ని రంగరించి ఆయన కు మేధస్సు ను ఇచ్చాం.

శిలను చెక్కి శిల్పం చేసాము. అది రాయి కాదు రత్నం అని మనమే ప్రజలను నమ్మించాము.

తెలంగాణ అన్న పదమే పలకరాన్ని వ్యక్తిని తెలంగాణ భాషకే పట్టాభిషిక్తున్ని చేసాం. తెలంగాణ యాసలో ఆయనను మించినోడు లేడని మనమే ప్రచారం చేసాం.

భస్మాసురుడికి శివుడు వరమిచ్చినట్లుగా తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు అందరం కలిసి తెలంగాణ పైకి ఓ బస్మాసురుడు వదిలిపెట్టాం. ఇప్పుడు ఆ భస్మాసురుడి నుంచి రక్షణ కోసం నలదిక్కుల పరిగెడుతున్న పరిస్థితి కనబడుతున్నది. అందుకే ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకొని ఇప్పుడేం చేద్దామనీ ఆలోచించుకొని సంఘటితంగా ముందడుగు వేయడం కోసం

చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైంది.

అభివృద్ధి కంటే ఆత్మగౌరవమే మిన్న అంటూ ఎన్నో మాటలు చెప్పి ఆత్మగౌరవ తెలంగాణ కోసమే పోరాటమని చెప్పాము. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులకు దక్కిన గౌరవంలో ఆవగింజంత అయినా ఇప్పుడు దక్కుతుందా ఆలోచిద్దాం రండి. 

నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి ఎవరి పాలయ్యాయి. ఎందుకిలా జరిగింది ఇవన్నీ ఇప్పుడు ముఖ్యమే.

పదేళ్ల తర్వాత కూడా వీటి గురించి ఆలోచించకపోతే మనం తెలంగాణ ద్రోహులమవుతాం.

దండుకున్నోడు దండుకొని పోతుంటే మనం దగాపడ్డ జనం పక్షాన నిలవాల్సి ఉంది. ఎందుకంటే దగాపడ్డ జనంలో మనమూ ఉన్నాం.

పదేళ్ల పండుగ ఉత్సవంలా జరుపుతామని ప్రభుత్వం అంటుంది. నిజంగా ప్రజలు ఉత్సవం చేసుకునే ఆనందంలో ఉన్నారా. రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల బలవన్ మరణాలు ఎక్కడైనా ఆగాయా.

వందలాదిమంది ఉద్యమకారుల బలిదానం మూలంగా ఏర్పడ్డ తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాకూడదని

తెలంగాణ ప్రజలందరికీ ఫలితం దక్కాలని ఆలోచిస్తే

ఆ వైపుగా అడుగులు వేస్తే ఇనుప సంకెళ్లు పోలీస్ లాఠీలు సమాధానాలు ఇస్తున్న ఈ పరిస్థితులు ఎమర్జెన్సీకి భిన్నంగా ఏమాత్రం కనిపించడం లేదు.

ఎవరికివారుగా మనకెందుకులే అని కూర్చుంటే

తెలంగాణ ప్రజానీకం లో పుట్టబోయే బిడ్డ కూడా అప్పుతోనే జన్మనిస్తుంది. చనిపోయి శవంగా మారిన 

ఆ శవం కూడా లక్షన్నర అప్పును మోస్తూనే ఉంది.

చావు కాడ, బతుకు కాడ ఒక్కటే పాట అన్నట్టు ప్రభుత్వం అన్నింటికీ కాలేశ్వరాన్ని చూపించి

ప్రపంచం కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తున్నది.

అభివృద్ధి అంటే ఆకాశ హార్మియాలు, 100 అడుగుల వెడల్పు రహదారులు కాదు. 

ప్రజల జీవనంలో మౌలిక మార్పులు సంభవించి

ఉత్పాదకత పెరిగి, స్వయం సమృద్ధి సాధించడం.

ఇవేవీ ఇప్పుడు తెలంగాణలో మచ్చుకైనా అభిపించడం లేదు.

ఓటు కోసం నోటు ఇస్తున్న తీరు మారి ఓట్ల కొనుగోలు కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టే తీరు తెలంగాణలో మొదలయ్యింది. 

దళిత బందులో 30% కమిషన్ కొందరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినా ఇంకా ఆ ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.

ఇదొక్కటే కాదు ప్రభుత్వ ప్రతి పథకంలో అమ్యమ్యాలు లేనిదే ఏ లబ్ధిదారుడికి సహకారం అందరమే లేదు.

ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గ గజ్వేల్లో పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లక్షల రూపాయలు వసూలు చేసిన అనేక సంఘటనలు వెలుగులోకి వస్తాయి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం ఉన్నా అందులో డాక్టర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.

అందమైన భవనాల్లో హాస్టల్లు, స్కూళ్లు ఉన్నా ఉన్నతమైన విద్య అందడమే లేదు.

నియోజకవర్గం చుట్టూ కాలువలు పరుచుకొని ఉన్నా 

ఏ ఒక్క ఎకరానికి కూడా కాలేశ్వరం నీళ్లు అందనే లేదు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం అందనే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి ఏ ఒక్క పథకం అమలుకు రాలేదు. 

కేజీ టు పీజీ కనుమరుగైపోయింది. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి సమాధి కట్టబడ్డది. మూడు ఎకరాల భూమి ఊసే లేదు. ధరణి పథకం పేరుతో పేదల భూములన్నీ పెద్దలపరమైపోయాయి.

కేటీఆర్ చెప్పే కంపెనీల పేర్లు ఆకర్షణీయంగా ఉన్న,

ఆశలు కల్పిస్తున్నా ఈ ప్రాంత ప్రజానీకానికి ఎన్ని ఉద్యోగాలు దక్కాయో ఎవ్వరికీ అర్థం కాదు.

నాటి నిజాములు నగరం చుట్టూ వదిలి వెళ్ళిన వేలాది ఎకరాల భూములు ఈ నయా నిజాముల పాలైపోయాయి.

నాటి పాలకుల ముందుచూపు నేటి పాలకులకు కాసుల పంట పండిస్తున్నది.

కంపెనీల పేరుతో వందలాది ఎకరాల భూమిని వారికి కావలసిన వాళ్లకు కట్టబెట్టి కమిషన్లు దండుకునే దుష్ట సంస్కృతి నేడు నెలకొని ఉంది.

ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎటు కాకుండా పోయారు.

ఉద్యమ ద్రోహులే అందలాన్నెక్కి ఉద్యమకారుల తలలపై నాట్యమాడుతుంటే ఇంకా ఇలానే చూస్తూ కూర్చుందామా ...

అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. ఇంకా చూస్తూ కూర్చుంటే మరో ఐదేళ్లలో ఈ ప్రభుత్వమే గద్దెనెక్కితే ఇక తెలంగాణలో మిగిలేది ఏముంటుంది అంతా ఆ కుటుంబం పాలే అవుతుంది.

అందుకే మరొక్కసారి అందరం కలవాలి ఆలోచించాలి.

పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు దగా పడ్డది ఎవరు. తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మరో పోరాటం అవసరమవుతున్నది అందుకే మళ్లీ జెఎసి పురుడు పోసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అనిపిస్తున్నది ఉద్యమకారులారా ఆలోచించండి.

kappara prasada rao.

9676776622

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్