నిర్దిష్ట గడువులోపు సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలి* *వీ.సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ.ఎస్ శాంతికుమారి



నల్గొండ జిల్లా


*నిర్దిష్ట గడువులోపు సీఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలి* 


 *వీ.సీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ.ఎస్ శాంతికుమారి* 


నిర్దిష్ట గడువులోపు సీ.ఎం.ఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీ.ఎం.ఆర్ ప్రగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి, కోటా మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్ సీ ఐ)కు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. గత డిసెంబర్ 31 నాటికే ఎఫ్.సి.ఐకి సీ.ఎం.ఆర్ కోటాను చేరవేయాల్సి ఉన్నప్పటికీ, అనేక జిల్లాలలో మిల్లింగ్ ప్రక్రియ పెద్ద ఎత్తున పెండింగ్లోనే ఉండిపోయిందని అన్నారు. ఈ నెల 31 వరకు ఎఫ్.సీ.ఐ గడువు పొడిగించినందున, నిర్ణీత సమయంలోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు చేరేలా చూడాలన్నారు. ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రైస్ మిల్లుల వారీగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. మిల్లర్లు పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు మిల్లింగ్ జరిపేలా కృషి చేయాలని, ప్రతి రోజు కనీసం 80 నుండి 90 శాతానికి పైగా మిల్లింగ్ నిర్వహిస్తే తప్ప నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా బియ్యం నిల్వలను చేరవేయడం సాధ్యం కాదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లులను అధికారులు నిరంతరం సందర్శిస్తూ, పూర్తి స్థాయిలో మిల్లింగ్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. .కేటాయించిన ధాన్యం నిల్వలను పరిశీలించాలని, అదేవిధంగా పీ.డీ.ఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, పోలీసు అధికారులను సమన్వయము చేస్తూ, అక్రమార్కులను గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 


 *అభయహస్తం దరఖాస్తులను సకాలంలో అప్లోడ్ చేయాలి : సీ.ఎస్* 


       కాగా, ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సకాలంలో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోపు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. రోజువారీగా నమోదు తీరును పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సమస్యలను గుర్తిస్తే వాటిని పరిష్కరించాలని హితవు పలికారు. ఈ విషయమై కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా జిల్లాలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగిందని, ప్రతిరోజూ దరఖాస్తులు అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో దరఖాస్తులు ఆన్ లైన్ లో నమోదు చేయిస్తామని అన్నారు. కాగా, ప్రజా పాలన కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో విజయవంతంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి ప్రశంసించారని సీ.ఎస్ తెలుపుతూ, కలెక్టర్లను అభినందించారు.   

 

   అనంతరం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులతో నిర్వహించిన సమావేశం లో

 మాట్లాడుతూ, జిల్లాలోని మిల్లుల వారిగా టార్గెట్ పెట్టి పౌరసరఫరాల అధికారులు సీఎంఆర్ సేకరించాలన్నారు. సీఎంఆర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లను ఏర్పాటు చేసి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ)ను ఆమె ఆదేశించారు. సిఎంఆర్ సేకరణలో ఎక్కడ జాప్యం చేయరాదన్నారు. మిల్లర్లు సాకులు చెబుతూ ఆలస్యం చేస్తూ సమయానికి సీఎంఆర్ అందించకుండా తీవ్ర చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించినందున, ఈ విషయాన్ని మిల్లర్లు గ్రహించి తగిన రీతిలో అనుకున్న సమయానికి సీఎంఆర్ అందించాలని ఆమె తెలిపారు. 

  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,

 అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.శ్రీనివాస్, డి.ఎస్. ఓ వెంకటేశ్వర్లు,

సివిల్ సప్లయిస్ డీ.ఎం., నాగేశ్వర్ రావు,ఎఫ్.సి. ఐ డి.యం.సుశీల్ కుమార్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్