పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నల్గొండ;
ఈ నెల 28 నుంచి మార్చి 19వ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలనీ అందుకు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతతో పాటు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ,పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేయాలన్నారు.
పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అనుమతించరాదని తెలిపారు.
ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్, తదితరులు హాజరయ్యారు.
Comments
Post a Comment