ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*

*ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్*

  



*హైదరాబాద్, మార్చి 16:*   జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్  జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్  రోనాల్డ్ రోస్ అన్నారు.


లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్లో  సి పి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు.



 ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి (శనివారం) నుండి అమలులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ లోక్ సభ సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిందని, తెలంగాణ లో ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 26న స్క్రూటిని, 29న విత్ డ్రాయల్ ఉంటాయని, మే 13న పోలింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కు ఆర్.ఓ గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ పార్లమెంట్ కు హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ ఆర్.ఓ లుగా వ్యవహరిస్తారని అన్నారు.


జిల్లాలో రెండు (హైదరాబాద్, సికింద్రాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్ లు ఉన్నాయని వివరించారు. జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు గానూ మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న  హైదరాబాద్ జిల్లా లో ఉన్న  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు  నోటిఫికేషన్  జారీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని. తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళి ని  కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రెండు నియోజకవర్గాలలో  మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ , వీడియో స‌ర్వేలెన్స్ బృందాలు ప‌నిచేస్తాయ‌ని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.   


జిల్లాలో  మొత్తం 45,70,138 మంది ఓట‌ర్లు కలరని, 1675 లోకేషన్స్ లో 3,986 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. మొత్తం ఓటర్లలో 22,39,240 మంది మహిళా ఓటర్లు, 23,30,574 పురుష ఓటర్లు, 324 మంది థర్డ్ జెండర్ ఓటర్లు, 402 స‌ర్వీసు ఓట‌ర్లు, 846 ఎన్ ఆర్ ఐ ఓటర్లు ఉన్నార‌ని తెలిపారు. 18 -19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు 65,595 మంది, ఎనభై ఐదు ఏళ్ళు పైబడిన  ఓటర్లు 36,664 మంది, దివ్యాంగ ఓటర్లు 22,995 మంది ఉన్నారని తెలిపారు. కోడ్ ఉల్లంఘన గురించి  గాని ఓటరు జాబితా పేరు పరిశీలనకు కూడా ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని, అలాగే ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా కోడ్ ఉల్లంఘన అంశాలు లైవ్ ఫోటోలు, వీడియోలు తీసి జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తేవచ్చని సూచించారు. 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుండి ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఈ.సీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.



ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, నామినేషన్లకు పది రోజులు ముందు వరకు 18 సంవత్సరాలు నిండిన అర్హత ఉన్న ఓటర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. షిఫ్టింగ్ ఓటర్ల ప్రక్రియ కూడా ఏప్రిల్ 14 వరకు తీసుకుంటారని తెలిపారు. స్వీప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్లను చైతన్య పరుచనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ  ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలన చేసుకోవాలని. ఈవీఎంస్ ఫస్ట్ లెవల్ చెకప్ పూర్తి చేసుకున్నామని, ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామన్నా రు. ఎవరికి ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.


హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఎలాంటి ఉల్లంఘనలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ మేరకు ఆయా కార్యక్రమాలను చేపట్టామన్నారు.  సి.ఏ.పి.ఎఫ్  కేంద్ర బలగాలు ఆరు కంపెనీలు ఇప్పటికే వచ్చాయని, బైండోవర్ ప్రక్రియ ప్రారంభం అయిందని, ప్లైయింగ్ స్కాడ్ బృందాలు ప‌నిచేస్తాయ‌ని తెలిపారు. జిల్లాలో ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించుట‌ నోడ‌ల్ పోలీస్  అధికారుల‌ను,స‌ర్వేలెన్స్, ప్లైయింగ్ స్కాడ్స్, సిబ్బందిని నియ‌మించామ‌ని తెలిపారు. అధికారుల‌కు కేటాయించిన విధులపై ఇప్ప‌కే  శిక్ష‌ణ‌, స‌మావేశాలు నిర్వ‌హించామ‌న్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని  అమలు చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు.


విలేకరుల సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్, ఈ.వీ.డి.ఎం ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ మంగతాయారు, చీఫ్ పిఆర్ఓ మహమ్మద్ ముర్తుజా, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు

 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్