విత్తనాల నిలువలు సరిపడా ఉన్నాయి - నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
వానకాలం పంటకు విత్తనాల నిలువలు సరిపడా ఉన్నాయి.
@ గత ఏడాది కంటే ఈ ఏడాది విత్తన నిల్వలు ఎక్కువ ఉన్నాయి
@ రైతులు ఆందోళన చెందొద్దు
@ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు- నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిలువలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.
శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యలయం లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని మండలాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీ లో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని, ఒకవేళ లూజ్ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం హెల్ప్ లైన్ నెంబర్ ని ఏర్పాటు చేశామని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్ లైన్ నెంబర్. 7288800023 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి, నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లపై ఉక్కు పాదం మోపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడిన టీం లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కాకుండా బయట విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని కోరారు. ఒకవేళ ఏ డీలర్ అయినా రైతులను తప్పుదోవ పట్టించిన, లూజు విత్తనాలు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తమ టీమ్స్ ద్వారా మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విత్తన నిల్వలు ఉన్నాయన్నారు.. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో 941 అవుట్లెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తనాలు అవసరమైన రైతులు ఈ ఔట్లెట్ల ద్వారా మాత్రమే కొనాలని తెలిపారు .ప్రభుత్వ ఆధ్వర్యంలో జీలుగా విత్తనాలను 30 కిలోలు1116/- రూపాయలకు, పిల్లి పెసర 40 కిలోలు 1084 /- రూపాయలు,పత్తి విత్తనాలు 475 గ్రాములు 864/- రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Post a Comment