సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి



నల్గొండ: 19 జులై ( గూఢచారి)

    ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకుగాను   హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు

విద్య వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని,విధుల పట్ల  ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


      శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


       ముందుగా ఆయన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది  హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు ,ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు.


       ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు  ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు.


     ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య  కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న ఔట్ పేషెంట్ల వివరాలు, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రసవాలు, మాత, శిశు సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ,తదిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.


        వర్షాకాలం ప్రారంభమైనందున  గ్రామ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా వ్యాధులకు గురైనట్లయితే తక్షణమే వైద్య సేవలందించేలా ఉండాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో మంచి వైద్యం అందించినట్లయితే ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా  ఉండిపోతారని అన్నారు. ఆశ, ఏఎన్ఎంలు గ్రామస్థాయిలో బాగా పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని తిరగాలని, అక్కడ శానిటేషన్, తాగునీటి పరిస్థితులు గమనించాలని, ప్రతి గ్రామంలో అంగన్వాడి ద్వారా గర్భిణి స్త్రీలు, బాలింతలు,చిన్నపిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఐరన్ మాత్రలను పరిశీలించాలని చెప్పారు .అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యేలా చూడాలని, వారు రెగ్యులర్గా ఆసుపత్రులకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

      అనంతరం జిల్లా కలెక్టర్  హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఆరవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు , ఇంగ్లీషును చదివించారు. అందరికీ రెండు జతల యూనిఫామ్ వచ్చాయా? పాఠ్య పుస్తకాలు ఇచ్చారా అని అడిగారు.  పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉందని?  గుడ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు .

పిల్లలు బాగా చదువుకోవాలని  సమాజంలో మంచి స్థానానికి రావాలని, ఇందుకు చదువు ఒక్కటే ఆయుధమని అన్నారు.


        తర్వాత  ఆయన పదవ తరగతి గదిలోకి వెళ్లి పదవ తరగతి విద్యార్థులతో ఫిజిక్స్, ఇంగ్లీష్ పాఠ్యాంశాలను  చదివించి అర్థాలను చెప్పమని అడిగారు. పదవ తరగతి తర్వాత ప్రత్యేకించి ఒకే అంశంపై దృష్టి సాధించవలసి ఉంటుందని, అందువల్ల విద్యార్థులు అన్ని సబ్జెక్టులు  చదవాలని, సబ్జెక్టుతో పాటు,ప్రతీది అర్థం చేసుకోవాలని, ప్రతిదానిపై అవగాహన కలిగి ఉండాలని ,ఉత్తీర్ణత మాత్రమే సరిపోదని, విషయంతో పాటు నేర్చుకొని ఉత్తీర్ణులు కావాలని సూచించారు. బీటెక్ అర్హత ఉన్నవారు సైతం ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి వస్తున్నారని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే జీవితంలో మంచి స్థానాన్ని పొందవచ్చు అని, ఈ సంవత్సరం జిల్లాలో  పదవ తరగతి పరీక్షలను క్రమ పద్ధతిలో నిర్వహిస్తామని, విద్యార్థులు కష్టపడి చదివి 10  కి 10 పాయింట్లు సాధించాలని సూచించారు. 


      ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నదని, డీఎస్సీ ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మరింత మంది టీచర్లు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా మనఊరు- మనబడి కింద పాఠశాలల్లో  పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులన్నీ పూర్తయి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు వస్తే  నాణ్యమైన విద్యను విద్యార్థులకు  అందించే అవకాశం కలుగుతుందని, అదేవిధంగా ఆస్పత్రుల ద్వారా సైతం మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు .


     ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జిల్లా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం షెడ్డును ,అలాగే భోజనాన్ని తనిఖీ చేశారు.. మధ్యాహ్నం భోజనం షెడ్ ను తాగునీరు సరఫరా చేసే కులాయిల వద్దకు మార్చాలని, అదేవిధంగా  కొత్త  కిచెన్ షెడ్డు

కట్టించేందుకు ప్రతిపాదనలు పంపించాలని  ఆదేశించారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంలో రావాలని, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని ,బాగా చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.


      జిల్లా కలెక్టర్ వెంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ, జిల్లా పరిషత్తు హాలియా ఉన్నత పాఠశాల ఇంచార్జ్ హెడ్ మాస్టర్ శైలజ తదితరులు ఉన్నారు


 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్