మంత్రి ఒకరు టెండర్ల వ్యవహారంలో తలదూర్చడం తగదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ముఖ్యమంత్రికి లేఖ
మంత్రి ఒకరు టెండర్ల వ్యవహారంలో తలదూర్చడం తగదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ముఖ్యమంత్రికి లేఖ
యధాతధంగా ప్రచురిస్తున్నాం చదవండి
హైదరాబాదు
L. No. FGG/CM/REP/ /2024 21-9-2024
గౌ// ముఖ్యమంత్రి గారు
తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదు
అయ్యా !
గత ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రతి సమావేశంలో ప్రజలనుద్దేశించి సోయిలో ఉండాలని హితవు పలికి, తానే సోయి తప్పి ధనిక రాష్ట్రమని చెప్పుకొని రెండుసార్లు పదవిని పొంది దాదాపు రూ// 7 లక్షల కోట్లు అప్పు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్థుతము మీ ప్రభుత్వము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. పాత పనుల బకాయిలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు.
గత బి.ఆర్.ఎస్. పాలకుల పాలనను ప్రజలు విసిగెత్తి వ్యతిరేకించి గత అసెంబ్లీ ఎన్నికలలో మీరిచ్చిన హామీలకంటే తెలంగాణను ఇచ్చిన పార్టీగా గుర్తించి గత ప్రభుత్వము యొక్క అవినీతి పాలనను ధిక్కరించి మీ సమర్థతను ఎరిగి మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్న సంగతి మరవద్దు.
గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వము పెద్ద అప్పులు తెచ్చి భారీ అవినీతికి పాల్పడి కొందరికే పనులను అప్పగించిన విషయము జగమెరిగిన సత్యం. అదే బాటలో మీ ప్రభుత్వము కూడ మళ్ళీ అప్పులు తెచ్చి కంట్రాక్టర్లకు పనులను అప్పగించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని తెలుస్తుంది. మీ సహచర మంత్రి ఒకరు నేరుగా తన పదవిని అడ్డు పెట్టుకొని అధికార బలంతో టెండర్ల వ్యవహారంలో తలదూర్చడం “శాసనము ద్వార నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని, రాగద్శేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రికి ఈ విధానం తగదు”.
గత ప్రభుత్వము చిన్న మరియు మధ్యతరగతి కంట్రాక్టర్లకు ఎటువంటి పేమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా పనుల యొక్క టెండర్లు పిలిచి ఎంతోమంది ఉత్సాహంగా పనులు కంప్లీట్ చేసినా చిన్న చిన్న కంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వక అప్పుల పాలు చేసింది. గత ప్రభుత్వము పనులకు సంబంధించిన పేమెంట్స్ విడుదల చేయడములో నిజాయితీగా వ్యవహరించలేదు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది.
గత ప్రభుత్వము మాదిరిగానే మీ ప్రభుత్వము కూడ ఒక వరుస పద్ధతిలో కాకుండా ఇష్టానుసారంగా సంబంధిత మంత్రి నేరుగా జోక్యము చేసుకొని పేమెంట్ చేయడం ఒక పత్రిక ద్వార తెలిసింది, ఈ చర్య అత్యంత దురదృష్టకరం. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వాలు నిజాయితీగా, పారదర్శకంగా జవాబుదారీతనంతో నడుచుకోకపోతే ప్రజలు అసహనానికి గురై ప్రభుత్వముపై విశ్వాసము కోల్పోతారు. నాయకులు తప్పులు చేస్తే చట్టము ఊరుకోదని మీకు తెలిసిందే. ఒకనాడు పదవిలో ఉన్న నాయకులు ప్రజలకు సమయమివ్వని వారు ఇప్పుడు ఖాళీగా ఉండి పశ్చాత్తాప పడుతున్నారని గమనించాలి.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ముందు చూపుతో ప్రజల కొరకు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించి సంస్కరించినప్పుడు ప్రజల జీవితాలు బాగుపడతాయి.
భవదీయుడు
సోమ శ్రీనివాసరెడ్డి
కార్యదర్శి
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Post a Comment