పేదలకు ఖర్చు లేకుండా సత్వర న్యాయము అందడానికి గ్రామ న్యాయాలయాలు స్థాపించాలని ముఖ్యమంత్రికి లేఖ
పేదలకు ఖర్చు లేకుండా సత్వర న్యాయము అందడానికి గ్రామ న్యాయాలయాలు స్థాపించాలని ముఖ్యమంత్రికి లేఖ
వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
లేఖ యదావిధిగా చదవండి
గౌ// ముఖ్యమంత్రి గారు
తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదు
అయ్యా !
పేదలకు ఖర్చు లేకుండా సత్వర న్యాయము అందడానికి గ్రామ న్యాయాలయాలు స్థాపించాలని లా కమీషన్ వారు కేంద్ర ప్రభుత్వాన్ని సూచించగా కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో గ్రామ న్యాయాలయాల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అటు పిమ్మట తేది 16-8-2009లో జరిగిన ముఖ్యమంత్రులు మరియు భారత ప్రధాన న్యాయమూర్తులతో ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్‌లో అక్టోబర్ 2, 2009 నుంచి అన్ని రాష్ట్రాలలో గ్రామన్యాయాలయాలు స్థాపించాలని నిర్ణయించడం జరిగింది. ఇందుకుగాను కేంద్ర న్యాయాలయాల స్థాపన కయ్యే ఖర్చు మొత్తం అలాగే సాలీనా అయ్యే ఖర్చులో సగభాగం భరిస్తామని అన్ని రాష్ట్రాలకు తెలుపడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామన్యాయాలయాల స్థాపనకై ఎటువంటి చర్యలు గైకొనలేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ విషయాన్న చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా చివరకు 2019లో జి.ఓ. నం. 4 ద్వార 55 గ్రామన్యాయాలయాల స్థాపన అలాగే జి.ఓ. నం. 10, తేది 5-2-2020 ద్వార 55 గ్రామన్యాయాధికారులు అలాగే 225 మంది సంబంధిత సిబ్బందిని కూడ మంజూరు చేయడం జరిగింది.
అటు తరువాత ఈ దస్త్రం రాష్ట్ర హైకోర్టుకు తదుపరి చర్యకై పంపడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా ఇది హైకోర్టు పరిశీలనలో ఉన్నట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలుపుతున్నారు.
గ్రామ న్యాయాలయాలపై సరియైన పురోగది లేనందున సుప్రీమ్ కోర్టు వారు తేది 11-9-2024 నాడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను మూడు వారాలలో ఎన్ని గ్రామ న్యాయాలయాలు స్థాపించినారో తెలుపవలసినదిగా కోరినారు. దీనిపై చాలా రాష్ట్రాలు స్పందించినా తెలంగాణ ప్రభుత్వం గాని, రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టు గాని ఇంతవరకు ఎటువంటి సమాచారము సుప్రీమ్ కోర్టుకు తెలుపలేదు. తరువాత సుప్రీమ్ కోర్టువారు సమాచారము ఇవ్వని వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలుపుతూ కేసు అక్టోబర్ 16, 2024 నాటికి వాయిదా వేసింది.
సత్వర మరియు ఖర్చులేని న్యాయం కొరకు భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కాని రాష్ట్ర హైకోర్టు గాని చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
ఇప్పటికైనా 55 గ్రామన్యాయాలయాలను స్థాపించి ఇంకా అధికంగా గ్రామ న్యాయాలయాల కొరకు చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌ// ముఖ్యమంత్రి గారిని కోరుతుంది.
భవదీయుడు
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Post a Comment