భారత సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా "లోక్‌మంథన్ "
భారత సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేలా "లోక్‌మంథన్ "
హైద్రాబాద్, (గూఢచారి):
అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగర్ వేదిక కానుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం (లోక్ మంథన్) అంగరంగ వైభవంగా సాగనుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాదులో నిర్వహించే లోక్‌మంథన్ (జాన పద వేడుక )కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గారితో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,పలువురు గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా వివిధ రంగాల ప్రముఖులు వేడుకకు హాజరు కానుండటం విశేషం. కేంద్ర మంత్రి, లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా జి. కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
దేశంలోని జానపద కళాకారులు అందరినీ ఏకం చేసి, వారి ప్రతిభాపాటవాలు నైపుణ్యాన్ని ప్రదర్శించే వేదికను ఏర్పాటు చేసింది ప్రజ్ఞా ప్రవాహ్ అనే సంస్థ. లోక్ మంథన్ అంటే జానపద మేళా అని చెప్పవచ్చు. వనవాసి గ్రామవాసి నగరవాసి మొత్తంగా భారతీయ వాసి అని దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరినీ ఏకం చేసే మహోత్తర కార్యక్రమానికి నాంది పలికింది ఈ సంస్థ. మొట్టమొదటిసారిగా 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లోకమంథన్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి నిర్వహిస్తూ వస్తోంది. ఝార్ఖండ్ రాజధాని రాంచి, సామ్ రాజధాని గౌహతిలో వేడుకలు నిర్వహించారు. అయితే కరోనా కారణంగా 2020లో నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాగ్యనగర్ లోని శిల్పారామం లో నవంబర్ 21 నుంచి 24 వరకు నాలుగో "లోక్ మంథన్" వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొండలు, కోనలు, గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, నగరాల్లో జీవించే ప్రజలందరినీ కలిపి భారతీయ జానపద కళాకారులను ప్రోత్సహించే గొప్ప జానపద జాతరను నిర్వహించడం అభినందనీయం. దేశ సాంస్కృతిక వారసత్వం.. దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖులను పిలిచి చర్చించి మేథో మథనం చేయడం లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. 4 రోజుల పాటు జరిగే ఈ మేళాకు దేశం లోని మారుమూల ప్రాంతం నుంచి మొదలుకొని విదేశాల నుంచి సైతం ప్రతినిధులు జానపద కళాకారులు హాజరవుతున్నారు. కాశ్మీరు నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు వివిధ జానపద అభిరుచులు..విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు గల కళాకారులు హాజరై ప్రదర్శనలిస్తారు. వేలాది కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, విదేశాల నుంచి కూడా ప్రతినిధులు సహా అన్ని వర్గాలవారు పాల్గొంటారు. సాగర మథనం జరిగినట్టుగా నేటి సమస్యలపై సదస్సులు, కళా ప్రదర్శనల ద్వారా లోక్ మంథన్ కార్యక్రమం భాగ్యనగర్ లో ఓ మైలురాయిగా నిలవనుంది. అడవులు, కొండ కోనల్లో నివసించే వనవాసీలు, మైదాన ప్రాంతాల్లో జీవించే బంజారాలు అందరూ హాజరవుతారు. వనవాసి, గ్రామవాసి, నగరవాసి... అందరూ కలిస్తేనే భారత్ వాసి అవుతామని లోక్‌మంథన్ ప్రధాన ఉద్దేశం. కులం,మతం, భాష, వేషం, ఆచార వ్యవహారాలు ఇలా అనేక రకాలుగా ప్రజల్ని విభజించే దుర్మార్గపు పరిస్థితులున్న నేటి సమయంలో రాజకీయాలకు అతీతంగా భారతీయ భావజాలంతో వేడుక సాగనుంది. వందల సంస్థలకు చెందినవారి భాగస్వామ్యంతో ఈ లోక్ మంథన్ చరిత్ర సృష్టించనుంది.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచ సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఆలోచనా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం, అందుకు కావలసిన వ్యవస్థను నిర్మించుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
జాతీయ గిరిజన గౌరవ దివాస్ గా
భగవాన్ బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూరుస్తుంది.
లోక్‌మంథన్ వేడుకలో గిరిజనుల చేతివృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసే స్టాల్స్‌లో పలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయి. హైదరాబాద్, చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చేలా అందరినీ అహ్వానిస్తున్నారు. ప్రదర్శన తిలకించేందుకు త లక్షలాది మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
"లోక్" అంటే ఏదో ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన మాట కాదు. అది మన దేశపు మూల సంస్కృతికి సంబంధించినది. వేర్వేరు సంస్కృతులున్నప్పటికీ అంతర్గతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే కార్యక్రమము ఇది. దేశంలో నేడు కొన్ని శక్తులు ప్రజల్లో చీలికలు తెచ్చి విద్వేష భావాన్ని నింపుతున్నాయి, అందువల్ల మరో సారి ఏకత్వాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికీ వలసపాలన ప్రభావంలోనే ఉన్న మన భావజాలాన్ని దాని నుంచి విముక్తి చేయడం బాధ్యతగా ఉందంటూ లోక్‌మంథన్ వేదికగా మేధావులు, కార్యాచరణశీలురు కలసి ఈ దిశగా కృషి చేస్తారు. లోక్ అవలోకన్ ప్రధాన అంశంగా లోక్ విచార్ (ప్రకృతి, సాంస్కృతిక సంబధమైన ఆలోచనా ప్రక్రియ), లోక్ వ్యవహార్ (సంప్రదాయాలు - ఆచరణ), లోక్ వ్యవస్థ (సంస్థలు-వ్యవస్థలు) అనే మూడు ఉప అంశాలతో లోక్‌మంథన్ ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా లోక జీవనదృష్టి, లోక జీవన విజ్ఞానం, లోక సాహిత్యం, లోక అర్థశాస్త్రం, భారతీయ లోక చేతనలో పర్యావరణం, లోక సురక్ష-న్యాయం, లోక సర్వసమావేశీ వ్యవస్థ తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి. ప్రత్యేకించి మన భావితరాలైన విద్యార్థులు, యువతరం దృష్టి సారించేలా లోక్‌మంథన్ రూపకల్పన జరిగింది.
మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వివిధ వృత్తులు, రంగాలకు చెందిన కళాకారులు వస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక భారతీయ వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన ఉంటుందని, ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కి విచ్చేస్తున్నారని, వీరిలో *సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సుర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆ దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. లోక్‌మంథన్ ఎగ్జిబిషన్స్‌లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయి.
లోక్‌మంథన్‌కు ప్రతి ఒక్కరూ విచ్చేసి భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అనుభవించి, ఆస్వాదించాలే అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఉత్సవం జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
Comments
Post a Comment