మునిసిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ & సాంకేతిక సభ్యులను నియమించమని ముఖ్యమంత్రికి లేఖ
మునిసిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ & సాంకేతిక సభ్యులను నియమించమని ముఖ్యమంత్రికి లేఖ
వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
లేఖ యధాతధంగా.....
గౌ// ముఖ్యమంత్రి
తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదు
అయ్యా !
అక్రమ కట్టడాలతో ప్రణాళికా బద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందడం లేదు. అలాగే అక్రమ కట్టడాలతో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మునిసిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకునే సందర్భంలో బిల్డర్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే ఆర్డర్‌లు తెచ్చుకొని అక్రమ కట్టడాలు పూర్తి చేయడమే కాకుండా అమ్మడం జరుగుతుంది. విషయాలు తెలియని అమాయకులు ఇట్టి అక్రమ కట్టడాలు కొని చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. చాలా సందర్భాలలో బిల్డర్‌లు బిల్డింగ్ నిబంధనలు పట్టించుకోకుండా నిర్మాణాలు జరిపి అట్టి కట్టడాలలో నివసించే వారికి ప్రాణాపాయ పరిస్థితులు కలిపిస్తున్నారు.
అక్రమ కట్టడాల నిర్మాణం ఆదిలోనే ఆపివేయడానికి అలాగే కేసుల విచారణ త్వరితగతిన పూర్తిచేయడానికి, తెలంగాణ ప్రభుత్వం 2016 లో మునిసిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జిల్లా జడ్జి చైర్‌పర్సన్‌గా డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అధికారి సభ్యులుగా ఉండి ప్రజల నుంచి మునిసిపల్ అధికారులు కట్టడాలపై ఇచ్చిన నోటీసులు పరిశీలించి పరిష్కరిస్తారు. అంటే ప్రజలకు మునిసిపాలిటీకి మధ్య వారధిగా ట్రిబ్యునల్ ఉంటుంది. కాని చైర్‌పర్సన్ అలాగే సాంకేతిక సభ్యుల నియామకం చేయకపోవడంతోగత 6 సంవత్సరాలుగా ట్రిబ్యునల్ కాగితాలకే పరిమితమైంది
ఎంతకూ ప్రభుత్వంలో చలనం లేనందున 2019లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ (113/2019) వేయడం జరిగింది. ట్రిబ్యునల్ పనిచేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. చివరకు తేది 27-4-2022 నాడు విచారణ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాలలో ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ మరియు సాంకేతిక సభ్యుల నియామకం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ట్రిబ్యునల్ ఛైర్మన్ నియామకానికి ముగ్గురు విశ్రాంత జడ్జిల పేర్లు కూడ పంపినా ప్రభుత్వంలో చర్యలు లేవు.
అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయుటకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను నెలకొల్పింది. హైడ్రా వారు పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల కూల్చివేత మొదలుపెట్టడం ఇది రాజకీయ దుమారం లేపడం చివరకు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించడం వరకు వెళ్ళింది. రాష్ట్రప్రభుత్వము 2016లోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఉంటే ఇన్ని అక్రమ కట్టడాలు వెలిసేవి కావు. హైడ్రాను నియమించే అవసరము ఉండేది కాదు. అలాగే బాధితులు హైకోర్టు వరకు వెళ్ళే పని తప్పేది.
బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్, సాంకేతిక సభ్యులు మరియు ఇతర సిబ్బందిని తక్షణమే నియమించి ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌ// ముఖ్యమంత్రి గారిని గారిని కోరుతుంది.
భవదీయుడు
యం. పద్మనాభరెడ్డి అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Encl : High Court Order
Comments
Post a Comment