భద్రతా కమీషన్ & పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
రాష్ట్ర భద్రతా కమీషన్ & పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
లేఖ యధాతధంగా చదవండి
గౌ// ముఖ్యమంత్రి గారు
తెలంగాణ రాష్ట్రం
హైదరాబాదు
అయ్యా !
పోలీసుశాఖలో సంస్కరణలు కావాలని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నో కమిటీలు సిఫారసు చేయగా చివరకు 2006 సంవత్సరంలో సుప్రీమ్‌కోర్టు వారు తీర్పు వెలువరిస్తూ ఆరు మార్గదర్శకాలు సూచించినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర భద్రతా కమీషన్ ఏర్పాటు అలాగే పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు .
భద్రతా కమీషన్ పోలీసుశాఖ పనితీరును నిశితంగా సమీక్షించడమే కాక వారికి సరియైన సూచనలు, సలహాలు ఇస్తూ పోలీసుశాఖ వారు చట్ట ప్రకారము పనిచేసే విధంగా సహకరిస్తుంది. ఇక పోలీసు కంప్లయింట్ అథారిటీ, రాష్ట్ర మరియు జిల్లాలో పనిచేస్తుంది. రాష్ట్ర కంప్లయింట్ అథారిటీ విశ్రాంత హైకోర్టు జడ్జి ఆద్వర్యంలో ఐ.పి.ఎస్. అధికారులపై వచ్చిన ఆరోపణలను విచారిస్తుంది. అలాగే జిల్లా అథారిటీ విశ్రాంత జిల్లా జడ్జి ఆద్వర్యంలో డి.ఎస్.పి. మరియు క్రిందిస్థాయి అధికారులపై వచ్చే ఫిర్యాదులను విచారిస్తుంది.
గత కొద్ది సంవత్సరాలుగా పోలీసుశాఖను రాజకీయనాయకులు తమ గుప్పిట్లో పెట్టుకొని అన్ని అక్రమాలు చేయించినారు. ముఖ్యంగా అనధికార ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షనాయకులపై కేసులు వంటివి.
అలాగే చాలా సందర్భాలలో భూకబ్జాలు, నేరచరిత్రులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడడం జరిగింది. సుప్రీమ్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసుశాఖలో సంస్కరణలు కావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ కూడ వేయడం జరిగింది. కేసు కోర్టులో ఉంది. పోలీసుశాఖలో సంస్కరణలలో భాగంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ క్రింది సలహాలు, సూచనలు చేస్తుంది.
1. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీసు చట్టం : దేశంలోని చాలా రా ష్ట్రాలలో కొత్త పోలీసు చట్టం లేదా ఉన్నవాటికే సవరణలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2. రాష్ట్ర భద్రతా కమీషన్ ఏర్పాటు మరియు విధివిధానాల ఖరారు : 2021లో హైకోర్టులో కేసు ఉన్నందున ఆదరా బాదరగా ఒక భద్రతా కమీషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఒక జి.ఓ. ఇచ్చినా అది ఇంతవరకు అమలుకాలేదు. ఇప్పుడైనా గట్టి రాష్ట్ర భద్రతా కమీషన్ ఏర్పాటు చేయాలి.
3. పోలీసు కంప్తయింట్ అథారిటీ నియామకం అలాగే విధివిధానాల ఖరారు : రాష్ట్ర మరియు జిల్లాల వారీగా పోలీసు కంప్లయింట్ అథారిటీని నియమించవలసి ఉండగా హైకోర్టులోని కేసు దృష్ట్యా 2021లో హైదరబాదు మరియు వరంగల్ జిల్లాలో మాత్రమే ఏర్పాటు చేయుటకు జి.ఓ. ఇచ్చినా అది అమలు కాలేదు. ఇప్పుడైనా సుప్రీమ్‌కోర్టు వారు ఆదేశించిన విధంగా రాష్ట్ర మరియు ప్రతి జిల్లాకు ఒక పోలీసు కంప్లయింట్ అథారిటీని ఏర్పాటు చేసి, విధి విధానాలు ఖరారు చేయాలి.
ప్రస్థుతం రాష్ట్రంలోపరిస్థితులలో పోలీసు వ్యవస్థ సరియైన దిశలో పని చేయడం లేదు. రాజకీయ ఒత్తిడుల మధ్య పోలీసు శాఖ తమ విధులు సక్రమంగా నిర్వహించుట లేదు. అలాగే పోలీసు వారి మీద వచ్చే ఫిర్యాదులు విచారించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ లేదు. ఇందుకు గాను రాష్ట్ర భద్రతా కమీషన్ అలాగే పోలీసు కంప్లయింట్ అథారిటీల నియామకం, విధివిధానలు ఖరారు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతుంది.
భవదీయుడు
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Post a Comment