వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాలి - NCAP పై సమీక్ష లో పిలుపునిచ్చిన మంత్రి సురేఖ
హైద్రాబాద్, డిసెంబర్ 13, (గూఢచారి) : తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖలు సహాయ, సహకారాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సెక్రటేరియట్ లోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పై సుదీర్ఘ సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టిజి పిసిబి మెంబర్ సెక్రటరీ రవి, సిఈఈ రఘు, జెసిఈఎస్ సత్యనారాయణ, ఎస్ఈఎస్ డి. ప్రసాద్, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వ ప్రసాద్, నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, సిడిఎమ్ఎ జాయింట్ డైరక్టర్ సంధ్య, టిజిఈఆర్ టిసి ఈడి మునిశేఖర్, అగ్రికల్చర్ జెడి ఆశా కమారి, సిఈ టిఎస్ఐఐసి శ్యామ్ సుందర్, సిఈ హెచ్ఎండిఎ రవీందర్, పిసిబి ఈఎస్ జయశ్రీ, జిహెచ్ఎంసి, టిజిఆర్టిసితో పాటు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్యంగా జీవించే హక్కు వున్నదనీ, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నియంత్రణ, వాతావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో అమలవుతున్న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) కార్యాచరణ ప్రణాళికలను టిజిపిసిబి ఎన్ క్యాప్ నోడల్ ఆఫీసర్ డి. ప్రసాద్ మంత్రి సురేఖ కి సోదాహరణంగా వివరించారు.
దేశవ్యాప్తంగా 131 నాన్ అట్టెయిన్ మెంట్ సిటీల (అత్యంత కాలుష్య నగరాలు) ను గుర్తించగా, తెలంగాణ నుంచి హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డి లను నాన్ అట్టెయిన్ మెంట్ సిటీలుగా గుర్తించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. పిఎమ్(పర్టిక్యులేట్ మ్యాటర్) 10 ప్రమాణాలను వరుసగా 5 సంవత్సరాల పాటు మించిపోయినందున తెలంగాణ నుంచి ఈ నగరాలను నాన్ అట్టెయిన్ మెంట్ నగరాల జాబితాలో చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. పిఎం 10 లెవల్స్ ను 30-40 శాతానికి తగ్గించే లేదా జాతీయ ప్రమాణాల ప్రకారం 60 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్ సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు మంత్రి సురేఖ తెలిపారు.
గాలి నాణ్యత రోజు రోజుకీ క్షీణిస్తూ పోతుండటంతో తలెత్తున్న ఆరోగ్య సమస్యల పై మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నానాటికీ పెరుగుతన్న వాహనాల సంఖ్య, పరిశ్రమల విస్తరణతో గాలిలోని పర్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం) పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తున్న తీరు పట్ల మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్య నియంత్రణకై రాష్ట్రంలో త్రీ లెవల్ కమిటి పనిచేస్తున్న తీరును అధికారులు మంత్రి సురేఖ గారికి వివరించారు. సీఎస్ సారథ్యంలో స్టీరింగ్ కమిటి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటి, డిస్ట్రిక్స్ లెవల్ ఇంప్లిమెంటేషన్ కమిటిలు పనిచేస్తున్నట్లు అధికారులు మంత్రి సురేఖ వివరించారు. వీటితో పాటు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు చీఫ్ సెక్రటరీ సారథ్యంలో స్టేట్ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటి ఏర్పాటు చేసినట్లు పిసిబి అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో అత్యంత కాలుష్య నగరాలైన హైదరాబాద్, పటాన్ చెరు, నల్గొండ, సంగారెడ్డి లకు అందుతున్న నిధులు, కాలుష్య నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సురేఖ ఆరా తీశారు.
హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల బొగ్గు ఇంధనంగా వినియోగించే పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధనంగా గ్యాస్ ను వినియోగించే దిశగా గట్టి చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులకు నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం, నూతన ఈవీ పాలసీ, పరిశ్రమల నుండి విడుదలయ్యే ఉద్గారాల నియంత్రణకు ఎమిషన్ మానిటరింగ్ సిస్టమ్ లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ నియంత్రణ, సిగ్నలింగ్ సిస్టమ్స్ ఆధునీకరణ తదితర కార్యక్రమాల ద్వారా వాయునాణ్యతను పెంపొందించేందకు పటిష్ట కార్యాచరణతో ముందకు సాగుతున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. టిజి ఆర్టిసీకి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు నిమిత్తం రూ. 100 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. పలు ప్రాంతాల్లో కమ్మరివారు పొట్టకూటి కోసం రోడ్లకిరువైపలా చేస్తున్న పనులతో జరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకుగాను ఆయా కులసంఘాల ఫెడరేషన్ లతో చర్చించి, వారికి కాలుష్యరహితంగా ఉపాధి పొందే దిశగా కార్యాచరణను చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో వాహనాలు ఫిట్ నెస్ ల పై నిఘా పెట్టాలన్నారు. టిజిపిసిబి కాలుష్య నివారణ, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను క్రమం తప్పకుండా సమర్పించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. జిహెచ్ఎంసి, టిజిఆర్టిసి, టిజి రెడ్కో, టిజిఐఐసి, టిజిఆర్టీఎ, ట్రాఫిక్ పోలీస్, హెచ్ఎండిఎ లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణకు సమిష్టిగా ముందుకు పోవాల్సిన అత్యయిక స్థితి నెలకొన్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
*‘ఓపెన్ బర్నింగ్’ ను తీవ్రంగా పరిగణించాలి*
ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారాన్ని ఇష్టం వచ్చినట్లు కాలుస్తుండడం (ఓపెన్ బర్నింగ్ వల్ల) గాలి నాణ్యత దెబ్బతిని, ఊపిరితిత్తులకు తీవ్రమైన హాని జరుగుతున్నదని మంత్రి సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ బర్నింగ్ చూడ్డానికి చిన్న విషయంగా కనిపించినా, ఇది కలుగజేసే కీడు తీవ్రమైనదని మంత్రి అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణించాలని, చలికాలంలో ఓపెన్ బర్నింగ్ వల్ల కాలుష్య సమస్య మరింత తీవ్రమవుతుందని మంత్రి సురేఖ అధికారులను హెచ్చరించారు. ఈ దిశగా ప్రజలకు, పరిశ్రమలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓపెన్ బర్నింగ్ ను పూర్తిస్థాయిలో నివారించే దిశగా కార్యాచరణను అమలుచేయాలని స్పష్టం చేశారు.
Comments
Post a Comment