ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
లేఖ యధాతధంగా
గౌ// ముఖ్యమంత్రి గారు
తెలంగాణ రాష్ట్రం
హైదరాబాదు
అయ్యా !
పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి 2004 సంవత్సరములో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 2004 నుంచి 2014 వరకు 33.4 లక్షల ఇళ్ళను మంజూరు చేసినారు. అయితే ఈ కార్యక్రమం మంచి ఉద్ద్యేశ్యంతో చేపట్టిన అధికారులు, రాజకీయ నాయకులు చివరకు లబ్ధిదారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. మొత్తము 33.4 లక్షల ఇళ్ళు మంజూరు అవ్వగా దానిలో 20.49 లక్షలు పూర్తి అయినట్లు చూపించినారు, కాని అందులో కూడ కొన్ని పనులు మొదలుపెట్టలేదు. ఇంకా కొన్ని సగము వరకు పని జరిగి ఆగిపోయినాయి. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణము జరగకున్నానిర్మాణము జరిగినట్లు, కొన్ని సందర్భాలలో ఎప్పుడో కట్టిన ఇల్లు కూడ కొత్తగా కట్టినట్లు చూపించి డబ్బులు చెల్లించినారు. దీనికి స్థానిక రాజకీయనాయకులు సహాయ సహకారాలు ఇవ్వడం జరిగింది. ఈవిధంగా కట్టని ఇళ్ళు కట్టినట్లు, పాత ఇళ్ళు కొత్తగా కట్టినట్లు చూపిస్తూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రిగారు జి.ఓ. నం. 9 తేది 26-7-2014 ద్వార మొత్తము కేసు సి.ఐ.డి. వారికి అప్పగిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే సంబంధిత అధికారులపై ప్రభుత్వ నష్టాన్నివసూలు మరియు శాఖాపరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన నాటికి చాలా గ్రామాలలో పూర్తి కాని లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ళు అర్థాంతరంగా మిగిలిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని పక్కన పెట్టి కొత్తగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అసంపూర్తిగా మిగిలిన ఇందిరమ్మ ఇళ్ళకు నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలని లేనిచో ప్రభుత్వధనం వృధా అవుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వ పెద్దలకు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించడం జరిగింది (పిల్ నం. 233/2015). కోర్టు వారి ఆర్డర్‌తో నిధులు విడుదల చేయడంతో చాలామటుకు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వడం జరిగింది.
ఇక సి.ఐ.డి. విచారణకు సంబంధించి మొదట్లో విచారణ చురుకుగా సాగినా తరువాత ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,000 గ్రామాలుండగా కేవలం 36 గ్రామాలలో తనిఖీలు జరిపి పెద్ద అక్రమాలు జరిగాయని, పాత ఇళ్ళను కొత్తగా కట్టినట్లు చూపిస్తూ డబ్బులు తీసుకున్నారని పాత ఇళ్ళు ఎప్పుడు కట్టినారు అన్న విషయం తేల్చడానికి ఇంజనీర్లు కావాలని తెలుపుతూ విచారణ ఆపివేసినారు. ఇళ్ళు ఎప్పుడు కట్టినారు అన్న విషయం గ్రామపంచాయితీలో గాని గ్రామ పెద్దలను విచారించినా తగిన సమాచారము దొరుకుతుంది. అయితే సి.ఐ.డి. వారు అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఇంజనీర్లు కావాలని ఒక రిపోర్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ పేరున వేల కోట్ల రూపాయిల అవినీతి జరిగినా, పది సంవత్సరాలనుండి ఎటువంటి విచారణ జరుపక దస్త్రాన్ని పక్కన పడేసినారు. రాష్ట్ర సచివాలయంలో ఇలా అవినీతిపై చర్యలు గైకొనకపోవడంతో అవినీతి పరులకు ప్రోత్సాహమిచ్చినట్లు అవుతుంది. ఏమి చేసినా “సబ్ చల్తాహై” అన్న వాతావరణం నేడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొని ఉంది.
ప్రస్థుతము ప్రభుత్వము పేదల బాగోగుల కొరకై పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టింది. ఈ పథకాలన్నీ లబ్ధిదారులకు చేరాలంటే అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరముంది. అలాగే తప్పు చేస్తే శిక్షపడుతుంది అన్న భయముండాలి. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004 నుంచి 2014 వరకు జరిగిన అవినీతి, ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించి వేల కోట్ల రూపాయిల అక్రమాలకు పాల్పడ్డ దోషులను శిక్షించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌ// ముఖ్యమంత్రి గారిని కోరుతుంది.
భవదీయుడు
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Comments
Post a Comment