తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోండి* *దేశభక్తులు ఆర్యవైశ్యలకు క్షమాపణ చెప్పండి - బండి సంజయ్


 *పొట్టిశ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది?*



*ఆయన గొప్ప దేశభక్తుడు...స్వాతంత్ర్య సమరయోధుడు*


*హరిజనోద్దరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చిపోయారా?*


*ఆంధ్రా మూలాలుంటే పేర్లు మార్చేస్తారా?*


*ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మార్చే దమ్ముందా?*


*ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించే దమ్ముందా?*


*తక్షణమే చేసిన తప్పును సరిదిద్దుకోండి*


*దేశభక్తులు ఆర్యవైశ్యలకు క్షమాపణ చెప్పండి*


*కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్...*


*కరీంనగర్ లో పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి అర్పించిన సంజయ్*


*పొట్టి శ్రీరామలు పేరును తొలగించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రిని కలిసిన ఆర్యవైశ్య సంఘం*

పొట్టి శ్రీరాములు పేరిటనున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టిశ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యవైశ్యుల ఆరాధ్య నేత అని కొనియాడారు. అట్లాంటి గొప్ప నేత పేరును మార్చాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. ‘‘సురవరం ప్రతాపరెడ్డి అంటే మాకు గౌరవముంది. తెలుగు భాష ఉన్నతికి క్రుషి చేశారు. తెలుగు భాషాభివ్రుద్ధికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆయన పేరును పెట్టుకుంటే అభ్యంతరం లేదు. కానీ పొట్టి శ్రీరాములు తొలగించి అవమానించడం కరెక్ట్ కాదు’’అని పేర్కొన్నారు. 


పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు స్వయంగా అల్పాహారం అందించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. సీపీఐ నాయకులు ప్రతిపాదిస్తే... సీఎం రేవంత్ రెడ్డి తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించారని వాపోయారు. సీఎం తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమరయోధులతోపాటు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీనిని అడ్డుకోవాలని, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించకుండా గవర్నర్ ను కోరాలని అభ్యర్ధించారు. 


అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... ‘‘పొట్టి శ్రీరాములంటే…. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష ప్రాణాలర్పించిన అమరజీవి మాత్రమే కాదు…గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులను వదిలేసుకుని దేశం కోసం పోరాడిన వ్యక్తి. మహాత్మాగాంధీజీ ఇష్టమైన వ్యక్తి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిండు. సత్యాగ్రహా, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3సార్లు జైలుశిక్ష అనుభవించిండు. చరఖా వ్యాప్తికి కృషి చేసిండు. హరిజనోద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన నాయకుడు. ‘‘పొట్టి శ్రీరాములు లాంటోళ్లు నావద్ద 10 మంది ఉంటే చాలు… ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్యం తెచ్చేటోడిని’’అని మహాత్మాగాంధీ బహిరంగంగానే చెప్పారంటే ఆయన ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అట్లాంటి మహనీయుడు పేరును తొలగించి తీరని అవమానం చేయడమేంది?’’అని మండిపడ్డారు.


మహనీయులను కాంగ్రెస్ పార్టీకి అవమానించడం అలవాటుగా మారిందన్నారు. ‘‘ఆనాడు అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసిన పొట్టి శ్రీరాములును కూడా పిచ్చివాడిగా ముద్ర వేయాలని చూసింది.’’ అని పేర్కొన్నారు. 

’’ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఎన్టీఆర్ పార్క్ కు ఆయన పేరును తొలగించే దమ్ముందా? కాసు బ్రహ్మనందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించే దమ్ముందా? కోట్ల విజయభాస్కర్ పేరిట ఉన్న స్టేడియంకు ఆ పేరును తొలగించే దమ్ముందా? అంతేందుకు ట్యాంక్ బండ్ పై అనేక మంది ఆంధ్రుల విగ్రహాలున్నాయి. వాటిని కూడా తొలగిస్తారా?...’’అని ప్రశ్నించారు.


‘‘ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని పొట్టిశ్రీరామలు పేరును యధాతథంగా తెలుగు విశ్యవిద్యాలయానికి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆర్యవైశ్య సమాజానికి, దేశభక్తులందరికీ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.’’అని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!