భూ భారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి




     భూ భారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం తీసుకొచ్చిందని చెప్పారు.


       రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో  భాగంగా సోమవారం నల్గొండ జిల్లా, చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


        మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగిందని, ఈ నెలాఖరునాటికి ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్ 2  నుండి ఈ పైలెట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని తెలిపారు. మే 1 నుండి అన్ని జిల్లాలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోనున్నామని, అత్యంత వెనుకబడిన చందంపేట మండలాన్ని కూడా పైలెట్ మండలంగా తీసుకునే విషయమై ఆలోచిస్తామని తెలిపారు. జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి తహసిల్దార్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యల పై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూముల సర్వే కోసం  6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10695 మందిని వచ్చే నెల మొదటివారం నుండి పంపించనున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూదార్ కార్డు ను ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇవ్వనున్నమన్నారు. గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని,భూ భారతిలో దీనిని పరిష్కరించనున్నామని, తొమ్మిది లక్షల 26 వేల సాదా బైనామా దరఖాస్తులున్నాయని ,వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి పేద వాడి కన్నీళ్లు తుడిచేందుకు తీసుకువచ్చిన చట్టం భూ భారతి చట్టం అని, ఈ చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని, చట్టాన్ని బాగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడే చుట్టంగా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.  గతంలో పట్టాలిచ్చిన డి- లిమిటేషన్ ఫారెస్ట్  భూములను పరిశీలించి,  ఎవరికి ఎంత భూమి ఉందో నిజంగా   సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పునరావాసకాలనీల ఏర్పాటు సందర్భంగా, ఒక చోట నుండి మరోచోటికి రైతులు వెళ్లిన సందర్భంలో రైతులకు ఇచ్చిన భూముల డీ లిమిటేషన్  విషయంలో ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారని, అలాగే డీ నోటిఫికేషన్ భూముల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణి సమయంలో ప్రభుత్వం వద్దకు ప్రజలు వెళ్లాల్సి వచ్చేదని, వీటన్నిటికీ పూర్తిగా న్యాయం జరిగేలా భూ భారతి లో ప్రణాళికలు రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. తమది సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమని చేతల ద్వారా నిరూపిస్తున్నామని మంత్రి వెల్లడించారు.


       సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి  100 సంవత్సరాలు పనికొచ్చేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, చందంపేట మండలంలోని పలు గ్రామాలలో అటవీ భూములకు పట్టాలిచ్చారని, అయితే గడచిన పదేళ్లలో రైతులు చాలా సమస్యలను  ఎదుర్కొన్నారని, వీటన్నిటికీ ఎంజాయ్ మెంట్ సర్వే చేసి నిజమైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వాలని, అలాగే డి ఫారెస్ట్ అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయని, తిరుమలగిరి సాగర్ లాగే  చందం పేట మండలాన్ని పైలెట్ మండలంగా తీసుకొని ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేవరకొండ నియోజకవర్గం లో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నందున అదనపు   కోటా కింద  ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని  మంత్రిని కోరారు. ఎస్ఎల్బీసీ  టన్నెల్ పనులు పూర్తి చేయడంతో పాటు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గంలోని భూములకు సాగునీటి తీసుకొస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1800 కోట్లతో ఏదుల నుండి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని, దీని ద్వారా లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని ,దీంతో పాటు, చిన్న చిన్న లిఫ్టులన్నిటిని పూర్తి చేస్తామన్నారు.


      ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం  ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిందని, దీంతోపాటు, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వ అమలు చేస్తున్నదని ,వీటన్నిటిని వినియోగించుకోవాలని కోరారు.


      శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ధరణిలో అనేక సమస్యలు ఉండేవని సాగు కాలాన్ని తీసివేశారని, అలాగే కొన్ని గ్రామాలు ధరణిలో బ్లాక్ చేయడం జరిగిందని, వీటన్నిటిని పరిష్కరించేందుకు  భూ భారతి తీసుకు వచ్చిందని, డీ ఫారెస్ట్ భూములు పరిష్కరించే దిశగా ఆలోచించాలని, నల్గొండ జిల్లాలో సర్వేయర్లు తక్కువగా ఉన్నందున మండలానికి ఒక సర్వేయర్ ను నియమించాలని,  క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమిపై ఉన్న వారికె పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని ,భూభారతి పై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.


      జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ అందరికీ మేలు జరిగేలా భూ భారతిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. 2020లో వచ్చిన ధరణి వల్ల చందంపేట మండలంలోని 6 గ్రామాలు బ్లాక్ లో ఉన్నాయని, భూ భారతి ద్వారా వాటిని పరిష్కరించే అవకాశం ఇప్పుడు ఉందన్నారు. మోఖ మీద ఉన్న వారి పేరును భూ భారతి ద్వారా  ఎక్కించే బాధ్యత రెవెన్యూ శాఖదేనిని, భూభారతి ద్వారా తహసిల్దార్ ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకున్న 30వ రోజు పని పూర్తవుతుందని, ఒకవేళ కానట్లయితే 31వ రోజు ఆటోమేటిక్ గా అవుతుందన్నారు. ఈ అధికారాలు ఆర్డీవోకు ఉన్నాయని, ఉచిత న్యాయ సహాయం  ఏర్పాటు చేసే అవకాశం, సంవత్సరానికి ఒకసారి భూమి రికార్డులను అప్డేట్ చేసె  అవకాశం భూ భారతి లో ఉన్నాయని కలెక్టర్ వేల్లడించారు.చందం పేట మండలంలో ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.


      మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి ,జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ,దేవరకొండ  అదనపు ఎస్ పి మౌనిక, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!