ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తుంది
నల్గొండ జిల్లా: గూఢచారి: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.
గురువారం అయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి మండలకేంద్రం డిండి లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు.
సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమని ఆయన అన్నారు .ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ బియ్యం 90 శాతం రీసైక్లింగ్ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేనివిధంగా సన్నబియాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నదని, అందువలన రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని ఆయన కోరారు. ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన దింది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని రైతులు పండించిన సన్న వడ్లను ప్రాసెసింగ్ చేసి సన్నబియ్యాన్ని చౌక ధర దుకాణాలు, రేషన్ షాపులు, హాస్టళ్లు, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా ఇవ్వలేదని ,రైతులు సన్నధాన్యాన్ని పండిస్తే తిరిగి పేదవారికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ బీసీలకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నదని, నిరుద్యోగ యువతీ యువకులందరూ స్వయం ఉపాధి పొందేందుకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని ,ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, అందువల్ల రైతులు సన్నధాన్యాన్ని పండించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహిస్తున్నదని కలెక్టర్ తెలిపారు.
దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, తదితరులు మాట్లాడారు. జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్ కార్యక్రమం లో ఉన్నారు.
Comments
Post a Comment